Warangal News: చెరువులో అనుమతి లేకుండా చేపలు పట్టారని కోపంతో బట్టలు ఊడదీసి మరీ చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపల్లిలో గురువారం రోజు జరిగింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన చిరుకూరి సుమన్, నల్లబెల్లి మండలం పద్మాపూరం గ్రామానికి చెందిన ఇసాల జగన్ కన్నారావుపేట ఉప సర్పంచ్ తురస ఆశోక్, గట్టి చెన్నయ్యలు పద్మపురం సమీపంలోని అర్షనపల్లి చెరువులో చేపలు పట్టేందుకు గురువారం ఉదయం వెళ్లారు. అయితే చేపలు పడుతున్న విషయం తెలుసుకున్న ఈ చెరువు కాంట్రాక్టర్లు సిద్ద గణేష్, సురేష్ లతో పాటు మరికొందరు వెళ్లి ఆ నలుగురినీ వెంబడించారు. 


అయితే చిరుకూరి సుమన్ పట్టుబడగా.. మిగతా ముగ్గురూ పారిపోయారు. సుమన్ కాళ్లు, చేతులను వెనకవైపు నుంచి కట్టేసి బోల్లోనిపల్లికి తరలించారు. గ్రామంలో చెట్టుకు వలలతో కట్టేసి దాడి చేశారు. పారిపోయిన ఇసాల జగన్ బోల్లోనిపల్లి గ్రామానికి చేరుకొని కాంట్రాక్టర్ తో చర్చించేందుకు ప్రయత్నించగా అతడిని సైతం దూషిస్తూ.. బట్టు విప్పి మరీ చెట్టుకు కట్టేసి కొట్టారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. పంచాయితీ నిర్వహించి అక్రమంగా చేపలు పట్టిన నలుగురు వ్యక్తులూ.. రూ.25 వేల జరిమానా చెల్లించాలని తీర్మానించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పద్మాపురం గ్రామానికి చేరుకొని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. 


ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ.. 


హన్మకొండలోని ఓ ప్రభుత్వ దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మద్యం సేవించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఆసుపత్రికి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాక మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల మహిళలు చికిత్స కోసం వస్తుంటారు. ఈ  ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ చర్చనీయాంశం అయింది. స్టాఫ్‌రూమ్‌లో మహిళా సిబ్బంది బీర్లు తాగుతూ హల్ చల్ చేశారు. రోగులను గాలికి వదిలేసి బీర్లు తాగుతూ సిబ్బంది హంగామా చేశారు. మద్యం పార్టీలో ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్, జీఎన్‌ఎమ్ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యవహారంపై చికిత్స కోసం వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌ను బార్‌గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 


పుట్టిన రోజు వేడుకలు పేరిట మందు పార్టీ 


హన్మకొండ ప్రసూతి ఆసుపత్రి ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది బయట నుంచి మరో ఇద్దరు మహిళలను పిలిచి ఆసుపత్రిలో బీర్ పార్టీ చేసుకున్నారు. బుధవారం రాత్రి పుట్టినరోజు వేడుకల పేరిట ఓ గదిలో వైద్య ఆరోగ్య సిబ్బంది మందు పార్టీ చేసుకున్నారు. మందు పార్టీ దృశ్యాలను ఆసుపత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది ఇలా బాధ్యత రహితంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ ఉన్నతాధికారుల కార్యాలయాలకు సమీపంలో ఈ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఉంది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఈ ఘటనతో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.