Lawyer Karuna Sagar Letter: తనకు రక్షణ కల్పించమని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తరఫు న్యాయవాది కరుణ సాగర్ తెలంగాణ సీజేకు లేఖ రాశారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లాయర్ కరుణ సాగర్ బెయిల్ ఇప్పించారు. అప్పటి నుండి ఆగంతకులు తనను బెదిరిస్తున్నారని, ఇటీవల హైకోర్టు గేట్ వద్ద తనపై దాడి కూడా చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సీజేకు రాసిన లేఖలో ఏముందంటే..?
తన ప్రాణానికి తీవ్ర ముప్పు ఉందని అడ్వకేట్ కరుణాకర్ వివరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు న్యాయవాదిగా ఉన్నందుకు.. తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వివరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను అనేక కేసుల్లో నిర్దోషిగా బయటకు తీసుకు వచ్చేందుకు తాను కృషి చేశానని.. ఇటీవలే ఆయన కేసులో వాదించి బెయిల్ ఇప్పించానని తెలిపారు. అప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయని వివరించారు.
ఈ నెల 23వ తేదీ రోజు ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ తనకు ఫోన్ చేసి చెప్పారని.. ఈ విషయంపై సైదాబాద్ పీఎస్ లో రెండు సార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ 26వ తేదీన తాను కోర్టు ఆవరణలో ఉండగానే తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని ఈ విషయంపై చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా 2012వ సంవత్సరం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని లేఖలో వెల్లడించారు. ఇలా ఇప్పటి వరకు తాను వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశానని అందుకు సంబంధించిన 10 ఎఫ్ఐఆర్ లను కూడా జత చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇవన్నింటిని చూస్తుంటే.. తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నట్లు అనిపిస్తోందని.. అందుకే తనకు భద్రత కల్పించాలని కోరారు.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వివాదం తలెత్తింది. తీవ్రస్థాయిలో చేసిన ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యల అనంతరం పెద్ద ఎత్తున విమర్శలు వెల్తువెత్తాయి. ఒక వర్గం వారు రాజా సింగ్ వ్యాఖ్యల తర్వాత తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ సీపీ కార్యాలయం ఎదుట వేలాది మంది రోడ్డుపై బైటాయించారు. రాజా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయనపై అటు బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్ అయింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అదే క్రమంలో ఆందోళనలు తీవ్రం అయ్యాయి. రాజా సింగ్ పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా అశాంతికి, ఉద్రిక్తతలు, సంఘర్షణలకు రాజా సింగ్ ను కారకుడిగా పేర్కొంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. దీంతో రాజా సింగ్ అటు అరెస్టు కాగానే ఇటు జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ కేసులో రాజా సింగ్ తరఫున వాదనలు వినిపించినందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అడ్వొకేట్ కరుణ సాగర్ తన తెలిపారు. తాజాగా సీజేకు లేఖ రాశారు.