KTR :  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని తాకాయని పేర్కొన్నారు. 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు 11 శాతం ఉండగా.. 2004లో ‘భారత్‌ వెలిగిపోతున్న’ సమయంలో సెంట్రల్‌ గర్నమెంట్‌లో ఖాళీలు 12.1శాతం ఉంటే..  ఇప్పుడు  కేంద్రంలో ఖాళీలు 25శాతానికి చేరాయని విమర్శించారు. ఈ సందర్భంగా గణాంకాలతో ట్వీట్‌ చేశారు. హోంమంత్రిత్వశాఖలో 11.1శాతం, రైల్వేలో 20.5శాతం, డిఫెన్స్‌ సివిలియన్‌ 40.2శాతం, రెవెన్యూలో 41.6శాతంతో పాటు తదితర విభాగాల్లో ఖాళీలున్నాయని పేర్కొన్నారు.


 



 


కేటీఆర్ చేసిన ట్వీట్‌లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందనే అర్థం ఉంది. 2004 ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి వాజ్ పేయి ఉండేవారు. ఆ సమయంలో ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ భారత్ వెలిగిపోతోంది అన్న అర్థంతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ప్రచారం రివర్స్ అయింది. ప్రజలు బీజేపీని ఆదరించలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా బీజేపీ అచ్చేదిన్ అనే ప్రచారం చేసుకుంటోంది. ఈ అక్రమంలో అప్పటి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖాళీగా ఉన్నాయని..  ఖాళీ అవుతున్నప్రతి నాలుగు ఉద్యోగాల్లో మూడు మాత్రమే భర్తీ చేస్తున్నారని.. మరొకదాన్ని ఖాళీగా ఉంచుతున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. 


కేంద్ర ప్రభుత్వం ఇటీవల  పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. వరుసగా ప్రధానమంత్రినరేంద్రమోదీ స్వయంగా ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చే రోజ్ గార్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిషన్ మోడ్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున ఖాళీలు ఉంటే అతి తక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ విషయంలో విమర్శలను తగ్గించుకున్నట్లుగా కనిపించిన కేటీఆర్ .. తరచూ కేంద్రంపై ఇలాంటి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.  


రెండు పార్టీల మధ్య ఓ అవగాహన ఉందన్న  ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇది బీఆర్ఎస్ కు కూడా ఇబ్బందికరమే కాబట్టి..  కేటీఆర్ మళ్లీ కేంద్రంపై విమర్శలు పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.  కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలనే కేటీఆర్ ప్రశ్నిస్తారని.. రాజకీయ పరంగా ఎలాంటి విమర్శలు చేరన్న వాదన వినిపిస్తోంది.