భారతదేశం ప్రపంచంతో పోటీపడి ముందుకు పోవాలంటే అద్భుతమైన విప్లవాత్మకమైన పాలనా సంస్కరణలు అవసరం అని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యూకేలో పర్యటిస్తున్న ఆయన  లండన్‌లో భారత  హై కమీషన్ కార్యాలయం నెహ్రూ సెంటర్ లో జరిగిన సమావేశంలో భారత్ , బ్రిటన్ కి చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా (diaspora) ముఖ్యులతో సమావేశం అయ్యారు.  డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జొయ్ ఘోష్ , నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ అనేక అంశాల పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు.  


ప్రపంచమంతా తమ దేశ జనాభా వృద్ధాప్యం వైపు నడుస్తుంటే, భారత దేశ జనాభా లో ఉన్న అత్యధిక యువ బలం ఆధారంగా అగ్రశ్రేణి దేశంగా మారేందుకు అవకాశం ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఒకవైపు పాలనా సంస్కరణలు, పెట్టుబడి స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.


తెలంగాణ  భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న సంక్షుభిత పరిస్థితులను దాటుకొని ఈ రోజు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు ఆకర్షించే ఒక అద్భుతమైన పెట్టుబడుల ఆకర్షణీయ గమ్యస్థానంగా మారడానికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణమన్నారు. కేవలం పెట్టుబడులే కాకుండా ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరము ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన తీరుని వివరించారు.  సమావేశానికి హాజరైన వారు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కావని అవి భారతదేశ విజయాలు గా పరిగణించి, ప్రపంచానికి చాటాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా వివిధ దేశాల్లో ఉన్న భారత ఎన్నారైలు దేశం యొక్క విజయాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.


విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థికాభివృద్ధి వంటి అనేక అంశాల పైన సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు సమాధానంగా తన అభిప్రాయాలను కేటీఆర్ పంచుకున్నారు.  మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం అనంతరం సభకు హాజరైన వారు, ఆయనను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలిపారు. కేటీఆర్ వివిధ అంశాలపైన మాట్లాడిన తీరు, తెలంగాణ ప్రస్థానాన్ని వివరించిన తీరు పట్ల అభినందనలు తెలిపారు.