Telangana News : తెలంగాణ కాంగ్రెస్‌లో .. కోదండరాంపార్టీ తెలంగాణ జన సమితి విలీనం అవుతందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కోదండరాం స్పందించారు. హైదరాబాద్‌లో జూపల్లి కృష్ణారావుతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన .. కేసీఆర్ ను ఓడించడానికి కలిసి పని చేస్తాం కానీ.. విలీనం ప్రస్తావన అసలు లేదని స్పష్టం చేసారు.   రాష్ట్రంలో ఉన్న నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని.. అలాంటి ఐక్యతను సాధించే లక్ష్యంతో తప్పకుండా పనిచేస్తామని అన్నారు. అయితే విలీనం అనే ప్రసక్తే రాదన్నారు. 


టీజేఎస్‌ను విలీనం చేయాలన్న ప్రతిపాదనతో  తనను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కలిసారనే వార్తల్లో వాస్తవం లేదని.. అసలు చర్చలే జరగలేదని కోదండరామ్ స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని, ఇక్కడ కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాదని, ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంలేదని, నిరంకుశత్వం కొనసాగుతోందని.. దాన్ని అంతమొందిచడానికి అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికలపై రాష్ట్ర కమిటీ మీటింగ్‌లో చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామిక పాలన రావాలని, దాని కోసం మహాకూటమిగా ఏర్పాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు.                         


తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా కీలక పాత్ర పోషించిన కోదండరాం..  ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు.  తెలంగాణ జన సమితి పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలతో కూడిన మహాకూటమిలో కలిసి పని చేశారు.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దనే ఉద్దేశ్యంతో కూడా మహాకూటమిలో టీజేఎస్ చేరింది. అయితే అనుకూల ఫలితాలు రాలేదు.  ఉద్యమ నేత రాజకీయ పార్టీ పెట్టినందున ప్రజల్లో అంచనాలు ఉన్నా… పార్టీ ఊహించిన స్థాయిలో బలోపేతం కాలేదు. ముదస్తు ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోవడంతో కొంత మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఆ తర్వాత   పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేకపోయారు.  ఆర్ఎస్ పాలనపై పూర్తి వ్యతిరేకంగా ఉన్న కోదండరాం ఎలాగైనా కేసీఆర్ గద్దె దిగాలని చూస్తున్నారు. కానీ, కోదండరాం ఒక్కరితో అది అయ్యే పనికాదు.  ఒక ప్రొఫెసర్ గా… ఉద్యమ సారథిగా ఆయనకు తెలంగాణ పరిస్థతిపై పూర్తి అవగాహన ఉన్నందున కోదండరాంను కలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.                 


కారణం ఏదైనా కోదండరాం ఇటీవల అంత చురుగ్గా లేరు.కానీ ఆయనకు కొంత ఇమేజ్ ఉంది. ఉద్యమకారునిగా ఆయన ఇమేజ్ పార్టీకి పనికి వస్తందన్న ఉద్దేశంతో.. కాంగ్రెస్ పార్టీ విలీనానికి ప్రతిపాదిస్తోంది. కానీ కలిసి పని చేయడానికి సిద్ధమే కానీ.. విలీనానికి అంగీకరించేది లేదని ప్రొఫెసర్ చెబుతున్నారు.