Khammam Rains News: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ప్రమాదకరపు అంచుల్లో అలుగు పోస్తుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకారణంగా పరివాహకప్రాంతాల్లో నుంచి భారీగా వరదనీరు పాలేరుకు చేరుతోంది.


దీంతో 23 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 26 అడుగులకు చేరుకుంది. దీంతో జలాశయం నిండుకుండగా మారింది. జిల్లా సరిహద్దు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహంతో పాలేరు ఏటి నుంచి వరద నీరు చేరుతుంది. దీంతో రిజర్వాయర్ కట్ట కోతకు గురవుతుంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాల్లో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


నీట మునిగిన వడ్డెర కాలనీ 
రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం దాటి ఉదృతి తీవ్రం అవడంతో పాలేరు గ్రామంలోని వడ్డెర కాలనీ సుమారు 6 నుండి ఏడు అడుగులకు వరద నీరు చేరుకోవడంతో ఇండ్లు నీటిమయం అయ్యాయి. నీటిలో చిక్కుకున్న 23 కుటుంబాలను గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ ఫంక్షన్ హాలుకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్నివేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. రిజర్వాయర్ తీవ్రస్థాయిలో అలుగు పోస్తుండడంతో ఆయకట్టు సమీపంలోని కొన్ని వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.


రహదారిపై రాకపోకలకు అంతరాయం 
పాలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో అలుగుల ద్వారా వస్తున్ననీరు ఖమ్మం-సూర్యాపేట జాతీయ (పాత)రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. సుమారు రహదారిపై 3 అడుగు లోతు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దింతో రహదారిపై వరదనీరు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాకపోకలు పోలీసులు భారీ కేడ్స్ అడ్డు పెట్టి రాకపోకలు నిలిపివేసి దారి మల్లించారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున రిజర్వాయర్ సమీపంలో పర్యటకులను , సందర్శకులను పోలీసులు అనుమతించకుండా చర్యలు చేపట్టారు. 


పాలేరు జలాశయం అలుగు పారుతుండటంతో పర్యాటకులను కనువిందు చేస్తోంది. పాలేరు అలుగు పారుతున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో తెలుసుకుంటున్న పర్యాటకులు జలాశయం వద్దకు తరలివస్తున్నారు. కూసుమంచి సీఐ సంజీవ్,ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ జనం చెరువులు, జలాశయం దగ్గరకు వెళ్లకుండా నిరోదిస్తున్నారు.