ఖమ్మం నగరంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తనను మోసగించి ప్రియుడు మరో వివాహం చేసుకుంటున్నాడని ప్రియురాలు ఏకంగా వివాహ వేదిక వద్దకు వచ్చిన నిరసనకు దిగింది. దీంతో ప్రియుడి (పెళ్లి కుమారుడి) బంధువులు ఆ అమ్మాయిని లాగి పడేశారు. ఏకంగా పెళ్లి మండపం దగ్గరి నుంచి యువతిని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి బయట పారేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.
ఖమ్మం బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ఓ కల్యాణ మండపం వద్ద ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండగా తనను కాదని మరో పెళ్లి చేసుకుంటున్నాడని ఓ యువతి ధైర్యంతో ఆందోళనకు దిగింది. కల్యాణ మండపంలో పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఆందోళనకు దిగిన యువతిని, పెళ్లి కొడుకు బంధువులు జట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు.
బాధితురాలైన యువతి మాట్లాడుతూ.. శ్రీనాథ్ అనే యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెద్దలు కుదిర్చిన మేరకు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని యువతి ఆరోపించింది. అదే విషయం పెళ్లి మండపంలో తాను నిలదీశానని, దాంతో అతని బంధువులు తనను కొట్టి బయటికి లాగిపడేశారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.