Khairatabad Ganesh :  వినాయక చవితి పండుగ అంటే స్పెషల్ అట్రాక్షన్ ఖైరతాబాద్ గణేషుడే. ఈ సారి కూడా  తెలుగు రాష్ట్రాల్లో గణేషుని ఉత్సవాలు ప్రత్యేకంగా జరగనున్నాయి.   ఖైరతాబాద్ గణేష్ విగ్రహా నమూనాను నిర్వాహకులు విడుదల చేశారు.  ఈ ఏడాది పంచముఖ లక్ష్మిగణపతి రూపం లో  ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అయితే ఈ సారి ఎత్తు మాత్రం తగ్గించారు.  50 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేషుడ్ని నిర్మించనున్నారు. ఖైరతాబాద్ గణేష్ కు ఎడమ వైపున త్రిశక్తి మహా గాయత్రి దేవి. కుడి వైపున సుబ్రమణ్య స్వామీ ఉంటారు. 


ఈ సారి పూర్తిగా క్లే గణేష్ !


 ఈ సారి ఖైరతాబాద్ గణేషుడు పర్యావరణ స్నేహితుడు.పూర్తిగా  మొట్ట మొదటి సారి మట్టి తో సిద్ధం చేస్తున్నారు.  జూన్ 10 న కర్రపూజతో విగ్రహ తయారీ ప్రారంభణయింది సమయం  తక్కువగా ఉండటం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగంపై ఆంక్షలతో విగ్రహం ఎత్తును నిర్వాహకులు తగ్గించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా సన్నాహాలు చేశారు. 


పీవోపీ  విగ్రహాల నిమజ్జనం వద్దని హైకోర్టు ఆదేశం


నగరంలోని హుస్సేన్ సాగర్ తోసహా ఏ చెరువులోనూ ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో రూపొందించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించేది లేదని హై కోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి హై కోర్టు ఈ ఆదేశాలు గత సంవత్సరమే ఇచ్చింది. అయితే, అతితక్కువ సమయంలో పీఓపి తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేమని, ఈ సారికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కోరడంతో గత సంవత్సరం మాత్రమే చివరి నిమిషంలో హైకోర్టు అనుమతించింది. దీంతో ఈ సారి పూర్తిగా మట్టి గణపతి విగ్రహానికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకుంది.


ఈ సారి హైదరాబాద్ మొత్తం మట్టి విగ్రహాలే ?


హైదరాబాద్ మహానగరంలో ప్రతీ సంవత్సరం కనీసం 3 లక్షలకు పైగా గణేష్ మండపాలు పెడుతున్నారు. ఈ విగ్రహాల్లో దాదాపు 90 శాతం ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తోనే తయారీ చేసినవి ఉంటున్నాయి. ఈ విగ్రహాలను ట్యాంక్ బండ్ తోసహా ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా ఈ విగ్రహాల తయారీలో ఉపయోగించే జిప్సం, రసాయన కలర్లు నీటిలోని టాక్సిస్ స్థాయిలను పెంచడం ద్వారా చేపలతో సహా ఏ ఒక్క జీవాలు కూడా మనుగడ సాధించలేని పరిస్థితి నెలకొంది. పీఓపీతో తయారీని నియంత్రించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది.ఈ విషయంలో హైదరాబాద్ మహా నగరంలో అతిపెద్దదైన ఖైరతాబాద్ గణేష్ ను ఈ సారి 50 అడుగుల ఎత్తులో మట్టితో తయారు చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించి ఆ మేరకు ఆచరణలోకి తెస్తున్నారు