KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నాలుగు పేజీల లేఖలో ఆయన నీతిఆయోగ్ ఎలా నిరర్థకంగా మారిందో వివరించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కోఆపరేటివ్ ఫెడరలిజం కోసం దీన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కోఆపరేటివ్ ఫెడరలిజంని నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నారు. టీం ఇండియా పేరుతో ముఖ్యమంత్రులందరితో చర్చించి అభివృద్ధి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేశారని.. కానీ  నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు.


నీతిఆయోగ్ వల్ల రాష్ట్రాలు మరింత బలడాల్సి ఉందని..దీని వల్ల దేశం మరింత ధృతంగా తయారవుతుందన్నారు. కానీ గత ఏడేళ్లుగా నీతి ఆయోగ్ ఆశలను నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం నిర్ణయాలు రాష్ట్రాలను బలహీనం చేశాయని లేఖలో పేర్కొన్నారు.  మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది.. వీటిని పూర్తి చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని  కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు. అలాగే ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది.. ఈ కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి బ్రేక్ పడుతుందన్నారు.


 
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. రూపాయి విలువ పడిపోయింది.. నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.. ఇలాంటి అంశాలపై కేంద్రం చర్చించడం లేదని.. దేశంలో నీతి ఆయోగ్ అనేది నిరర్ధక సంస్థగా మారిపోయింది.. నీతి ఆయోగ్‌లో మేథోమథనం జరగడంలేదు.. అదో భజన బృందంగా మారిపోయిందని విమర్శించారు. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు ప్రతీ అంశంపై విస్తృత చర్చ జరిగేదన్నారు. రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు అసలు భాగస్వామ్యమే లేకుండా పోయిందని కేసీఆర్ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశాల్లో అసలు ఉపయోగపడే చర్చలే లేవన్నారు. అందులే పాల్గొనే ముఖ్యమంత్రులకు మాట్లాడేందుకు కొన్ని నిమిషాల సమంయ కూడా కేటాయించడం లేదని కేసీఆర్ గుర్తు చేశారు.


దేశంలో అసహనం పెరిగిపోయిందని.. బుల్డోజర్లు, ఎన్ కౌంటర్లు, మత పరమైన వివాదాలు , అంతర్జాతీయ విమర్శలతో దేశానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అయినా కేంద్రం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. టీమ్ ఇండియా అనిచెబుతున్నారు కానీ నిర్ణయాలన్నీ వన్ సైడెడ్‌గా జరుగుతున్నాయన్నారు. చివరికి ప్రభుత్వాలు అప్పులు తీసుకునే విషయంలోనూ కట్టడి చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్దిపై ప్రభావం చూపిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.


వ్యసాయ చట్టాలతో వ్యవసాయ రంగం..  పవర్ సెక్టార్‌ను విద్యుత్ సంస్కరణల పేరుతో ధ్వంసం చేశారని కేసీఆర్ విమర్శించారు. ఆలిండియా సర్వీసెస్ రూల్స్ను కూడా రాష్ట్రాలకు వ్యతిరేకంగా మార్చేసే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రాలకు పన్నుల ద్వారా అధిక ఆదాయం.. కేంద్రానికి తక్కువ ఆదాయం ఉండాలన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాల ఆదాయాలను కూడా కేంద్రం తీసుకుంటోందని ఇది ప్రజల్ని వంచించడమేనన్నారు. 


రాష్ట్రాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కారమంగా నీతిఆయోగ్ సమావేశానికి తాను హాజరు కావడం లేదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.