తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రత్యక్ష పోరాటంలోకి వచ్చిన సందర్భం గుర్తుందా..? ఆమరణ నిరాహారదీక్షతో ఉద్యమాన్ని ఓపెనింగ్ మాత్రమే చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడి అయినా మిలియన్ మార్చ్ అయినా సకల జనుల సమ్మె అయినా ఏదైనా ఆయన మస్తిష్కంలో ఆలోచన పుడుతుంది.. పకడ్బందీగా అమలు చేయిస్తారు. అంతే తప్ప ప్రతీసారి ప్రత్యక్షంగా రంగంలోకి దిగరు. అది కేసీఆర్ స్టైల్. ఉద్యమం అయినా రాజకీయం అయినా అంతే. టీఆర్ఎస్‌లో కర్త, కర్మ మాత్రమే కేసీఆర్.. క్రియ మాత్రం అనుచరులు చక్క బెడుతూ ఉంటారు. ఇప్పుడా పరిస్థితి మారింది.
ఇప్పటి వరకు వ్యూహరచన కేసీఆర్‌ది.. అమలు అనుచరులది..!
రాజకీయాల్లో సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆయన డైరక్ట్ లీడ్ తీసుకుంటారు. లేకపోతే మొత్తం తెర వెనుక మంత్రాగమే. ఆయన వ్యూహాలన్నీ లోపాల్లేకుండా అమలు చేసేందుకు పర్‌ఫెక్ట్ టీమ్ కూడా ఉంటుంది. హరీష్, కేటీఆర్ ఆ బృందాలకు నాయకత్వం వహిస్తూంటారు. ఉద్యమ సమయంలో ఈటల కూడా కేసీఆర్ ఆలోచనల్ని అమలు చేసే ముఖ్యుల్లో ఒకరు. రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ ఆరితేరిపోయారని.. ఆయన ఆలోచనలను అంచనా వేయడం అసాధ్యమని అందరికీ నమ్మకం. తెలంగాణ సమాజాన్ని, రాజకీయ పార్టీల నేతల మనసుల్ని ఇంకా చెప్పాలంటే ప్రజల మనస్థత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఆయన ఏ పనికైనా రంగంలోకి దిగారంటే ...చాలా సీరియస్‌గా తీసుకున్నట్లే భావించాలి. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్నారని అనుకోవాలి.
ఉపఎన్నిక కోసం వ్యూహాలు మాత్రమే కాదు నేరుగా కార్యాచరణలోకి కేసీఆర్..!
ప్రస్తుతం ఉపఎన్నిక కోసం కేసీఆర్ వ్యూహాలు మాత్రమే రచిస్తూండటం లేదు. స్వయంగా అమలు కోసం రంగంలోకి దిగారు. ప్రతీ చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. గెలుపు కోసం ఏం చేయాలో పగలు, రాత్రీ ఆలోచిస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని ఎక్కడ బలహీనంగా ఉన్నామో చూసి.. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. దళిత బంధు పథకం కోసం అన్ని పార్టీలనూ కలుపుకుని వెళ్లేందుకు సమావేశం పెట్టారు. ఆ పథకం అమలు కోసం నెల రోజు పాటు వరుసగా ఇంట్లోనే సమీక్షా సమావేశాలు జరిగాయి. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పై ... గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు.. పార్టీ శాఖల ఏర్పాటు కోసం ప్రస్తుతం స్వయంగా కసరత్తు చేస్తున్నారు.
ప్రతిపక్షాలు బలపడ్డాయని.. సవాల్ విసురుతున్నాయని నిర్ధారణకు వచ్చారా..?
తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా ఉపఎన్నికలు జరిగాయి. ఏ ఉపఎన్నిక విషయంలోనూ కేసీఆర్ సీరియస్‌గా దృష్టి పెట్టింది లేదు. ఏం చేయాలో.. ఎలా చేయాలో పార్టీ నేతలకు చెప్పి పంపేవారు. మిగతా పని వారు పూర్తి చేసేవారు. ఒక్క దుబ్బాకలో తప్ప ఎక్కడా ఫలితాలు తేడా రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం హుజూరాబాద్ విషయంలో మాత్రం తానే స్వయంగా రంగంలోకి దిగారు. కేసీఆర్ కార్యక్షేత్రం ఇప్పుడు జనంలోనే ఉంటోంది. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. పథకాలను ప్రారంభిస్తారు. ఓ రకంగా ఇప్పుడు కేసీఆర్ పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశారు.అయితే దీనికి కారణం ఒక్క హుజూరాబాద్ మాత్రమే కాదనే అభిప్రాయం మాత్రం గట్టిగా వ్యక్తమవుతోంది. దళిత బంధు పథకం ఒక్క హుజూరాబాద్‌కు మాత్రమే నిర్దేశించినది కాదు. అక్కడ అమలు చేసి .. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ట్రంప్‌కార్డుగా ఉపయోగించుకోవాలనుకుంటున్న పథకం. అంటే కేసీఆర్ వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారన్నమాట. అందుకే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. నిజానికి వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టినా కేసీఆర్ ఇలా రంగంలోకి దిగాల్సిన పని లేదు. గత ముందస్తు ఎన్నికల సమయంలో ఆయన ఫామ్‌హౌస్, ప్రగతి భవన్ నుంచే కథ నడిపించారు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిపక్షాలు బలపడ్డాయి. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ పోరాట స్ఫూర్తి కనబరుస్తోంది. ముఖ్యంగా దళిత బంధుకు పోటీగా తెచ్చిన దళిత, గిరిజిన దండోరా తో కాంగ్రెస్ జనంలోకి వెళుతోంది. ఇది ఆయన ఊహించలేదు. తన మాస్టర్ స్ట్రోక్‌లకు కూడా కౌంటర్ ప్లాన్‌తో ప్రతిపక్షాలు వస్తుండటంతో కేసీఆర్ బయటకు రాక తప్పడం లేదు అనే అభిప్రాయం బలపడుతోంది.
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీనీ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నడుమ వ్యూహాలకే పరిమితం కారాదని.. స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే తెలంగాణ రాజకీయాల్లో మార్పును సూచిస్తోందన్న కల్పించేలా చేస్తోంది. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడం ఆ పార్టీ క్యాడర్‌లో జోష్ నింపుతోంది.. అదే సమయంలో పరిస్థితి క్లిష్టంగా ఉందా అన్న సందేహం కూడా వారిలో ప్రారంభమవుతుంది. కేసీఆర్ "పొలిటికల్ హైపర్ యాక్టివ్ మోడ్"ను విపక్షాలు.. పడిపోతున్న గ్రాఫ్‌ను పట్టుకోవడానికని విశ్లేషిస్తున్నాయి.