KCR Jagruti : కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు ఇచ్చినట్లేనని కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. జాగృతి స్వతంత్రంగా పని చేస్తుందని అన్నారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎలాంటిదో.. తెలంగాణ జాగృతి కూడా అలాంటిదేనన్నారు. బీఆర్ఎస్ , జాగృతి కేసీఆర్ కు రెండు కళ్లు అని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. కేసీఆర్ పిడికిలి బిగిస్తేనే తెలంగాణ వచ్చిందని అలాంటి నేతకు నోటీసులు ఇవ్వడం ఏమిటన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్ అని తెలంగాణను అవమానించారని స్పష్టం చేశారు.
తెలంగాణ జాగృతిని పద్దెనిమిదేళ్ల కిందట ప్రారంభించామన్నారు. తెలంగాణ ప్రతి ఉద్యమంలోనూ జాగృతి భాగమైందని గుర్తు చేశారు. కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితోనే జాగృతి ఏర్పాటైందని స్పష్టం చేశారు. ప్రొ.జయశంకర్ చెప్పిన తర్వాతే తెలంగాణ జాగృతి స్థాపించామని.. ఆయనే తనకు దిశానిర్దేశం చేశారని కవిత తెలిపారు. ఇకపై కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు జరుగుతాయన్నారు.
తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా ..కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం. గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అని కూడా అనరన్నారు. . రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని నినదించాలన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులర్పించాలి. నివాళులర్పించని వారికి కుర్చీలో కూర్చునే అర్హత లేదని కవిత అన్నారు.
ఉద్యమకారులపైకి గన్ తీసుకెళ్లిన వాళ్లు.. ప్రస్తుతం రాష్ట్రానికి సీఎం అయ్యారని మండిపడ్డారు. తెలంగాణ పథకాలకు తెలంగాణ వారి పేర్లే పెట్టాలని కానీ రేవంత్ రెడ్డి ఇతరుల పేర్లు పెడుతున్నారని మడంిపడ్డారు. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి.. రాజీవ్ యువవికాసం అని కాదు. వేరే రాష్ట్రం తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటే మాట్లాడలేని పరిస్థితి రేవంత్‌దన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు. గోదావరి నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయన్నారు.
జాగృతికి ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించి ఇక బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా కార్యకలాపాలు నిర్వహించాలని అనుకోవడంతో .. కవిత సొంత పార్టీ దిశగా మరో అడుగు ముందుకేసినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ ఆశీస్సులతోనే తాను ఈ రాజకీయ అడుగులు వేస్తున్నానన్నట్లుగా కవిత వ్యవహరిస్తున్నారు. జాగృతి కూడాకేసీఆర్ కు బీఆర్ఎస్ అంత సమానం అని చెప్పడం ద్వారా .. కేసీఆర్ వ్యతిరేకించబోరన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నదానిపై కవిత రాజకీయ వ్యూహం అధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.