హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలకు భారత్ మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చింది. 1951లోఈ లండన్ లో  పోటీలు ప్రారంభం కాగా 1996లో 46వ ఎడిషన్ గా ఈ పోటీలు  మన దేశంలో బెంగళూరులో జరిగాయి. ఆ తర్వాత  71వ ఎడిషన్ ముంబయిలో, 72వ ఎడిషన్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అయితే  ఇప్పటి వరకు మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చిన మన దేశం రికార్డు స్థాయిలో ఆరు సార్లు  ప్రపంచ సుందరి కిరీటాన్ని గెల్చుకుంది. ఇప్పుడు గెలిస్తే అది ప్రపంచ రికార్డు అవుతుంది. ఏడు సార్లు గెలిచిన ఏకైక దేశం భారత్ కానుంది.

  ఏయే దేశాలు ఎన్ని సార్లు ఈ కిరీటం గెల్చుకున్నాయో తెలుసా ?

భారత్ ఇప్పటి వరకు ఆరు సార్లు ప్రపంచ సుందరి కిరీటాన్ని గెల్చుకుంది.  1966లో  మన దేశం నుండి   మిస్ వరల్డ్ కిరీటాన్ని రీటా ఫారియా తొలి సారి గెల్చుకున్నారు.  ఆ తర్వాత 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తా ముఖి, 2000 లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లార్  మన దేశం తరపున ప్రపంచ సుందరి వేదికపై జయకేతనం ఎగురవేశారు.  మన దేశం లాగానే వెనిజులా  కూడా ఆరు సార్లుఈ  టైటిల్ గెల్చుకుంది.

 ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న టాప్ 5 దేశాలు ఇవే

  1. భారతదేశం: 6 సార్లు  ఈ పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటం నెగ్గింది (1966, 1994, 1997, 1999, 2000, 2017) సంవత్సరాల్లో  మిస్ వరల్డ్ కైవసం చేసుకుంది.
  2. వెనిజులా కూడా మన దేశం లాగానే ఆరు సార్లు  మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. (1955, 1981, 1984, 1991, 1995, 2011) సంవత్సరాల్లో  వెనిజులా  సుందరీమణులు విజేతలుగా నిలిచారు.
  3. యునైటెడ్ కింగ్‌డమ్ (UK): మిస్ వరల్డ్ పోటీలకు పుట్టిల్లు అయిన  యూకే ఐదు సార్లు ఈ కిరీటాన్ని దక్కించుకుని రెండో స్థానంలో ఉంది (1961, 1964, 1965, 1974, 1983) సంత్సరాల్లో  యూకే  బ్యూటీస్ ఈ ఈ వెంట్ లో విజేతలుగా నిలిచారు.
  4. సౌత్ ఆఫ్రికా: ఈ పోటీల్లో పాల్గొని మూడు సార్లు విజేగా నిలిచింది. (1958, 1974, 2014) సౌత్ ఆప్రికా అందగత్తెలు ఈ కిరిటాన్ని దక్కించుకున్నారు,
  5. యునైటెడ్ స్టేట్స్ (USA): ఇక ప్రపంచ పెద్దన్న  అమెరికా  కూడా మూడు సార్లు  ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. (1973, 1990, 2010)  సంవత్సరాల్లో  అమెరికన్ నారీమణులు విజేతలుగా నిలిచారు.

వీరితో పాటు ఐర్లాండ్ మూడు సార్లు (1985, 1988, 2005) ఈ కిరీటాన్ని దక్కించుకోగా, జమైకా బ్లాక్ బ్యూటీస్  కూడా మూడు సార్లు (1963, 1976, 1993)లలో  విజేతలుగా నిలిచారు. యూరోపియన్ కంట్రీ స్వీడన్ భామలు కూడా మూడు సార్లు (1951, 1952, 1977)  ప్రపంచ సుందరి పోటీల్లో విజేతయ్యారు.

 ఈ దఫా బరిలో మన సుందరీమణి నందిని గుప్తా , గెలిస్తే రికార్డే

 ఈ పోటీల్లో  పోటీ పడే అందాల భామలు తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇలా మన దేశం ఆరు సార్లు, వెనిజులా ఆరు సార్లు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నాయి. అయితే ఈ దఫా మన దేశం తరపున 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరిటాన్ని గెల్చుకున్న నందిని గుప్తా ఫైనల్ కు చేరుకున్నారు. ఈమె రాజస్థాన్  లోని కోటాకు చెందిన 21 ఏళ్ల యువతి. బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేశారు.  ఈ దఫా నందినీ గుప్తా  ఈ పోటీల్లో విజేతగా నిలిస్తే ప్రపంచ రికార్డే అవుతుంది. మన దేశం  ఏడో సారి మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల్చుకున్నట్లు లెక్క. హైదరాబాద్ నగరం ఆతిధ్యం ఇస్తోన్న ఈ  అందాల పోటీల్లో మన సుందరీమణి నందిని గుప్తా  గెలవాలని ఆకాంక్షిద్దాం.