Karimnagar Bus Stand: కరీంనగర్: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్దది కరీంనగర్ బస్టాండ్ అని తెలిసిందే. మరి అలాంటి కరీంనగర్ బస్టాండ్లో ప్రయాణికుల నుంచి వ్యాపారస్తుల నిలువు దోపిడి సాగుతుందా...? అంటే అవునని వినిపిస్తోంది. కరీంనగర్ బస్టాండ్ మీదుగా రోజూ కొన్ని వందల బస్సులు వెళుతూ ఉంటాయి. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ప్రేమ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకుంటారు. బస్సుల కోసం వేచి చూసే ఆ ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండులో కొనే నీళ్ల నుంచి ఆహార పదార్థాల వరకూ వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ప్రయాణికులను మోసం చేస్తున్నారు. నాసిరకమైన తినుబండారాలను విక్రయిస్తూ ప్రయాణికుల ఆరోగ్యంతో సైతం ఆడుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇదేంటి అని ప్రశ్నిస్తే నాకు తెలియదు, ఓనర్‌ను అడగాలని షాపుల్లోని వారు చెబుతున్నారు. కరీంనగర్ బస్టాండ్ లోని దుకాణాల్లో అధిక వసూళ్లు, నాసిరకమైన అమ్మకాలపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ...


కరీంనగర్ బస్టాండ్ లో మొత్తం 40 వరకు దుకాణాలు ఉండగా ప్రతిరోజూ సుమారు వందల బస్సులు వేల ట్రిప్పులు వేస్తుంటాయి. నిత్యం రెండు లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణం సాగిస్తుంటారు. ఈ బస్టాండ్ లోని దుకాణాలలో వాటర్ బాటిల్స్, సమోసాలు, మిర్చీలు, చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లు ఇతర తిను బండారాలు సహా కూల్ డ్రింక్స్ విక్రయిస్తుంటారు. అసలే వేసవికాలం కావడంతో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు లైట్ స్నాక్స్ తీసుకుందామని తిను బండారాలు కొన్నా, దాహంగా ఉందని కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ కొన్నా.. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు నాసిరకమైన ఉత్పత్తులను విక్రయిస్తూనే ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.


ఇవే ఏబీపీ దేశం సీక్రెట్ గా విజువల్స్ చిత్రీకరించింది. కొరిక్యల గ్రామానికి చెందిన ఓ ప్రయాణికుడు సిద్ధిపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దాహం వేసి కరీంనగర్లోని బస్టాండ్ లో కూల్ డ్రింక్ తీసుకున్నాడు. కానీ ఎమ్మార్పీ కంటే పది రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. అదేంటి అని అడిగితే ఇక్కడ ఇలాగే విక్రయిస్తామని దుకాణదారుడు అన్నారని ప్రయాణికుడు తెలిపారు.
మరో ప్రయాణికుడు కరీంనగర్ నుంచి హైదరాబాదుకు వెళ్లే తన స్నేహితులను బస్సు ఎక్కించేందుకు వచ్చాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్టాండ్ లోని ఓ షాపు వద్దకు వెళ్లి మూడు కూల్ డ్రింక్స్ తీసుకోగా ఒక్కో దానిపై పది రూపాయలు ఎక్కువ తీసుకున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నించేవారు లేరా ఎవరైనా అధికారులు చర్యలు తీసుకుంటే బావుంటుందని ఏపీ దేశంతో  అన్నారు.


కరీంనగర్ బస్సు డిపో కంట్రోలర్
కరీంనగర్ బస్టాండ్ లో జరుగుతున్న నిలువు దోపిడి, నాసిరకమైన వస్తువులు, పదార్థాల అమ్మకాలపై ఏబీపీ దేశం వివరణ కోరగా.. ఇక్కడ జరిగే అలాంటి వాటిపై తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో కూడా నాణ్యత లేని పదార్థాలు విక్రయించడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరపడంపై తమకు కంప్లైంట్ వస్తే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎవరైనా ప్రయాణికులు తమకు రాత పూర్వకంగా కంప్లైంట్ ఇస్తేనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాణ్యత విషయానికొస్తే.. ఆహార భద్రత శాఖ వారు ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కరీంనగర్ బస్టాండ్లో జరుగుతున్న నిలుదోపిడి, నాసిరకమైన వ్యాపారాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడక తప్పదు.