తెలంగాణ ఉద్యమ గడ్డ కరీంనగర్‌లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పట్టణానికి చెందిన కీలక నేత రవీందర్ సింగ్ తన రాజీనామాతో మొదలైన అసమ్మతి జిల్లావ్యాప్తంగా వ్యాపించడంతో అనేక మంది లోకల్ నేతలు రాజీనామా బాట పట్టారు. ఇందులో భాగంగానే మొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలబడ్డ అనేక మంది సీనియర్ నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తమ నిర్ణయాన్ని బాహాటంగా వివరిస్తూనే రాజీనామాలు చేస్తున్నారు. దీంతో కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి విజయం అందుకునే విషయంలో కొంత ఆటంకం ఎదురయిందని చెప్పవచ్చు.
సింహ గర్జన సభతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరీలూదిన కరీంనగర్ గడ్డ ఇప్పుడు అదే రకంగా పతనానికి కారణం అవుతుంది అంటూ టీఆర్ఎస్‌కు చెందిన మాజీ సీనియర్ నేత రవీందర్ సింగ్ ప్రకటించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అనేక మంది నేతలు రాజీనామాల ఆలోచనలో ఉన్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ విజయం తథ్యం అని.. అధిష్ఠానం స్థాయిలో ఉన్న అహంకారం తమ విజయం ద్వారా అణిగిపోతుందని రవీందర్ సింగ్ జోస్యం చెప్పారు.
మరోవైపు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎల్.రమణ లాంటి నేతలకు ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా తమ నాయకులను అవమానాలను గురిచేసిన భాను ప్రసాద్ లాంటి వ్యక్తులకు ఎమ్మెల్సీని కొనసాగించడం కూడా దుర్మార్గం అంటున్నారు స్థానిక సీనియర్ నేతలు. అందుకే తాము రాజీనామా చేసి మరోవైపు అసమ్మతి ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానంపై తాడోపేడో తేల్చుకుంటామని అంటున్నారు. ఇక రాజకీయ శిబిరాల్లో తలదాచుకుంటున్న అనేకమంది నేతల నుండి వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని.. అయినా తాము ఓపికతో ఎదురుచూస్తున్నామని ఎన్నికల తేదీ అయిన డిసెంబర్ 10న అసలు ఫలితాలు బయటపడతాయని రెబల్ అభ్యర్థులు అంటున్నారు.
ఏదేమైనా ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో బెంబేలెత్తిన తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్ఠానం కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో మాత్రం కాస్తంత వెనకడుగు వేసిందని తెలుస్తోంది. స్థానిక రిపోర్టు ప్రకారం ఈ ఒక్క స్థానంలో ఓటమికే అవకాశం ఉందని అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించే అభ్యర్థి ఎవరో త్వరలోనే తేలనుంది.
Also Read: తొలిపాటకే 'నంది' అందుకున్న సిరివెన్నెల.. రాయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే..
Also Read: రెయిన్ అలర్ట్.. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. జవాద్ తుపానుగా మారే ఛాన్స్!