Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. జనవరి 12న నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడంపై జగిత్యాల ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ కుమార్ (కాంగ్రెస్) తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సంజయ్ కుమార్ పీఏ కాతరోజు వినోద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సమావేశంలో గందరగోళం సృష్టించి.. చర్చను పక్కదారి పట్టదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇంకో కేసు నమోదు చేశారు. దాంతో పాటు తన పట్ల దురుసుగా ప్రవర్తించాలని ఆరోపిస్తూ గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు ఫైల్ అయింది. అలా మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ వాగ్వాదమంతా నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ సమక్షంలోనే జరగడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
ఆదివారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కలెక్టరేట్ లో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. ఆ తర్వాత జగిత్యాల సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. పాడి కౌశిక్ రెడ్డి మధ్యలో అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మైక్ ఎందుకు ఇచ్చారు.. ఆయన ఏ పార్టీ అంటూ మండిపడ్డారు. అందుకు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ చెప్పడంతో.. ఇద్దరి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. క్రమంగా ఒకరినొకరు ధూషించుకోవడంతో.. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అలా కొంతసేపటి వరకు ఆడిటోరియంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పార్టీ ఫిరాయింపులపై ఇద్దరు నేతలు వాదనకు దిగగా.. కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటకు తీసుకెళ్లారు. దీంతో పార్టీ మారిన ప్రతీ ఎమ్మెల్యేనూ ఇలానే నిలదీస్తామని అనడంతో.. ముందు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ లు రాజనామా చేయాలని, తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతానని సంజయ్ తెలిపారు. ఈ క్రమంలోనే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకైనా సిద్ధమేనని.. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. సంజయ్ కాంగ్రెస్ కు అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. అంత ధైర్యముంటే తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు.
ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసులు
సంజయ్ కుమార్ పీఏ కాతరోజు వినోద్ కుమార్, గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం, ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని పోలీసులు హుజూరాబాద్ ఎమ్మెల్యేపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 121(1), 132,126 221,351(2), 126(2), 115(2), 352, 292, 132,115(2), 352, 292 సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ,
Also Read : Manda Jagannatham: మాజీ ఎంపీ మందా జగన్నాథానికి నివాళులు- తెలంగాణకు చేసిన సేవలు గుర్తు చేసుకున్న నేతలు