Manda Jagannatham : సీనియర్  రాజకీయ నాయకుడు, నాగర్‌కర్నూలు నుంచి 4సార్లు ఎంపీగా  ఎన్నికైన మందా జగన్నాథం  తీవ్ర అనారోగ్యంతో  కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మృతిచెందారు.  

నేతల నివాళులుమందా జగన్నాథం మృతి పట్ల తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth ReddY) సానుభూతి  తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో  ఆయన చేసిన సేవలు  మరువలేనివని గుర్తుచేసుకున్నారు. మందా జగన్నాథం మృతిపట్ల  ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu)  సంతాపం  తెలిపారు. నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన  జగన్నాథం...రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. పేద కుటుంబంలో  పుట్టినా   ఉన్నత చదువులు చదివి పైకి ఎదిగారన్నారు.  

తెలుగుదేశం(Telugu desam) పార్టీ  నుంచే  మూడు సార్లు ఎంపీగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ...కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చంపాపేటలో మందా జగన్నాథం  భౌతికకాయానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR)నివాళులు అర్పించారు.జగన్నాథం కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. మంద జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. తెలంగాణ ఓ అనుభజ్ఞుడైన రాజకీయ నేతను కోల్పోయిందన్నారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేశారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

వివాదరహితుడుగా, సౌమ్యుడిగా, తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తిగా ఆయన ప్రజల గుండెల్లో ఎప్పుడూ గుర్తుండిపోతారన్నారు. తెలంగాణ (Telangana)ఉద్యమ సమయంలో  కలిసి పనిచేసిన రోజులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ గుర్తుచేసుకున్నారు.అప్పటి  కాంగ్రెస్ సీనియర్ నేత  ప్రణబ్‌ ముఖర్జీ ఆగ్రహానికి గురై  గుండెపోటు వచ్చినా....మందా జగన్నాథం తెలంగాణ ఉద్యమాన్ని విరమించలేదని పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అన్నారు.  ఆయన మృతి పట్ల మంత్రి  పొన్నం ప్రభాకర్  సంతాపం వ్యక్తం చేశారు. జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఎమ్మెల్యే హరీశ్‌రావు(HarishRao) సంతాపం వ్యక్తం చేశారు.  

మందా జగన్నాథం నేపథ్యంనాగర్‌కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం జన్మించిన మందా జగన్నాథం.. నాగర్‌కర్నూలు నుంచి  నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరిన  ఆయన.....1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  నుంచి గెలుపొందారు.  ఆ తర్వాత  2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి మరోసారి  విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో విశేషంగా పాల్గొన్న ఆయన...నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత  2014 లో బీఆర్‌ఎస్‌లో చేరి మరోసారి పోటీచేసినా  స్వల్ప  ఓట్లతేడాతో  ఆయన  ఓటమిపాలయ్యారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు.

కేబినెట్ హోదా కలిగిన ఈ పదవీకాలం ముగిసినా కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు.  2023లో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినా  ఆయనకు టిక్కెట్  దక్కలేదు. దీంతో గత ఎన్నికలకు ముందు   ఆయన బీఎస్పీలో  చేరారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్నారు. గుండె, మూత్రపిండాలు దెబ్బతినడంతోపాటు ఊపిరితిత్తుల్లోనూ ఇన్‌ఫెకన్  కారణంగా  ఆయన నిమ్స్‌లో చికిత్సపొందుతూ  కన్నుమూశారు. అధికారిక  లాంఛనాలతో మాజీఎంపీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.