Intense Argument In Ministers Review Meeting In Karimnagar: కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాల గురించి చర్చ సాగుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy), జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలోనే నేతల మధ్య మాటా మాటా పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావంటూ సంజయ్‌ను కౌశిక్ రెడ్డి నిలదీశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా అక్కడే ఉన్న నేతలు వారికి సద్దిచెప్పేందుకు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.


బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి..


బయటకు వచ్చిన అనంతరం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా.? అని నిలదీశారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టేనా.? అని ప్రశ్నించారు. పోలీసులతో బయటకు లాక్కొచ్చారని.. కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.


నిధులు అడిగితే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని.. మిగతా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారని.. రెండో విడత దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'ప్రతి క్షణ రైతుల పక్షాన నిలబడతాం. అన్నదాతలకు రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాల్సిందే. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌తో గెలవాలి. మూడేళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు అధికారులతో పాటు ఎవరినీ వదిలేది లేదు.' అని స్పష్టం చేశారు.


Also Read: Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన