తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రన్నింగ్ రేస్ నిర్వహించారు. 30 ఏళ్ళ వయసు దాటిన మహిళలు మాత్రమే పాల్గొనాలని రూల్ పెట్టారు. ఐదు కిలోమీటర్ల ఈ పరుగు పందెంలో గెలిచిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. 


పరుగు పందెం బహుమతి ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆ ప్రాంతమంతా వ్యాపించింది. వందల మంది పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో రమ అనే 35 ఏళ్ల మహిళా రైతుకు పాల్గొని కప్‌తోపాటు లక్షరూపాయలు బహుమతి కైవసం చేసుకున్నారు. 


కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేవు. వందల మందితో పోటీపడుతూ రన్నింగ్ రేస్‌లో పాల్గొన్నారు రమ. మూడు నెలలుగా సాధన చేస్తున్న పోటీదారులను పక్కకు నెట్టేసి ప్రథమ స్థానంలో నిలిచారు మల్లం రమ. హుస్నాబాద్‌లో ఆమె పరుగు చూసిన వారు ఆశ్చర్యపోయారు.  


రమమ గెలుపులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... పోటీకి ముందు రోజు మాత్రమే ఈ విషయం తెలిసిందట. ఒక్క రోజులోనే పరుగు పందానికి రెడీ అయ్యారు రమ. అక్కన్నపేట మండలం మల్లంపల్లికి చెందిన మల్లం రమ రైతు. తల్లిదండ్రులతో బాటు కష్టపడటం అలవాటు చేసుకున్న రమ ఇతర ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. 


పోటీ నిర్వహించిన రోజైతే అందరూ ట్రాక్ సూట్, ఇతర డ్రెస్‌లలో వస్తే రమ మాత్రం పొలం పనులు చేసేటప్పుడు వేసుకునే చొక్కా ధరించి పరుగులు పాల్గొన్నారు. ఇక మిగతా వారు రన్నింగ్ షూ వేసుకుంటే తాను మాత్రం కనీసం కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు. పోటీలో పాల్గొన్న వారి అందరికన్నా ముందుగా 26.42 నిముషాల్లోనే రన్నింగ్‌ను పూర్తి చేసి అందర్నీ వెనక్కి నెట్టి ఆశ్చర్యపరిచారు రమ. 


 ప్రైజ్ మనీ లక్ష రూపాయల చెక్‌ను ప్రజలందరి సమక్షంలో ఎమ్మెల్యే రమకు అందజేశారు. ఆమె విజయాన్ని జిల్లా ఎస్పీ ఇతర ముఖ్య అతిథులు అభినందించారు.