Telangana Man Loves Sri Lanka Lady: మొదట స్నేహం, తర్వాత ప్రేమ, ఇప్పుడు పెళ్లి.. ప్రేమకు దేశాలు, ఖండాలు అడ్డంకులు కావని కరీంనగర్ యువకుడు, శ్రీలంక అమ్మాయి నిరూపించారు. ప్రేమ ఒక తీయటి అనుభూతి. ప్రేమకు హద్దులు కుల, మత ప్రాంత, భాష బేధాలు ఏమీ ఉండవని ఈ జంట (Karimnagar boy ties knot with Sri lanka girl) నిరూపించింది. దేశాలు వేరైనా, ఖండాంతరాల అవతల మనసు ఇచ్చిపుచ్చుకున్నారు. చివరగా పెద్దల్ని ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కరీంనగర్ (Karimnagar) అలుగునూర్ లో వీరి వివాహం జరిగింది. తరువాత శ్రీలంకలో అమ్మాయి సంప్రదాయంలోనూ వివాహం చేసుకుంటామని కరీంనగర్ యువకుడు తెలిపాడు.


కరీంనగర్ అబ్బాయి, శ్రీలంక అమ్మాయి..
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్ కు చెందిన దాసం అరుణ్ కుమార్ తిమ్మాపూర్ లోని జ్యోతిశ్మతి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పై చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ 2014 లో అరుణ్ కుమార్, అజ్జూరాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆపై ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమగా మారింది. 
ఇంకేముంది సీన్ కట్ చేస్తే... అరుణ్ కుమార్ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. కుమారుడి సంతోషంగా ఉండాలని విదేశీ యువతితో పెళ్లికి అంగీకరించారు. మరోవైపు అజ్జూరా కుటుంబం సైతం పెళ్లికి ఓకే చెప్పడంతో వీరి బంధం పెళ్లి పీటల వరకు వెళ్లింది. వధువు అజ్జురా శ్రీలంక నుంచి తల్లిదండ్రులతో కలిసి అలుగునూర్ వచ్చింది. అరుణ్ కుమార్, అజ్జురాలు మన సాంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో అంగరంగ వైభవం వీరి వివాహ వేడుక జరిగింది.


శ్రీలంకలో మరోసారి వివాహం!
ఎన్నో సంవత్సరాల తమ ప్రేమ ఇప్పుడు వివాహ బంధంగా మారడంపై నూతన వధూవరులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సాంప్రదాయ ప్రకారం కరీంనగర్ లోని అలుగునూర్ లో తమ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిందని వరుడు అరుణ్ కుమార్ చెప్పాడు. తరువాత తాము శ్రీలంకకు వెళ్తామని, అక్కడ అమ్మాయి సంప్రదాయం ప్రకారం మరోసారి తమ వివాహం చేసుకుంటామని తెలిపాడు.
శ్రీలంక దేశానికి చెందిన అజ్జారా కుటుంబం 60 సంవత్సరాల కిందటే ఇటలీ దేశానికి వలస వెళ్లారు. ప్రస్తుతం ఇటలీల్ దేశంలోనే నివాసం ఉంటున్న అజ్జరా, అరుణ్ తో పరిచయం ఏర్పడి, ఆపై ప్రేమించుకోవడం.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని వధువు చెప్పింది. తాను ఎన్నో దేశాల సాంప్రదాయాలను చూశాననీ, అయితే తెలుగు సాంప్రదాయంలో వివాహం చేసుకుంటానని ఎన్నడూ అనుకోలేదని చెప్పింది. ప్రేమించిన వ్యక్తికి పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించారని, అరుణ్ కుటుంబం సైతం తమ వివాహంపై సంతోషంగా ఉందని తెలిపింది.