పెద్దపల్లి జిల్లా మంథని పర్యటన సందర్భంగా రేపు (నవంబరు 2) రాహుల్ గాంధీ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించనున్న సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అక్కడికి అనుమతిస్తారా లేదా అన్న దానిపై తొలినుంచి సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే బ్యారేజ్ వద్ద 144 సెక్షన్‌ విధించారు. అయితే, రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లడానికి హెలికాప్టర్ కు అనుమతించారు. గురువారం రోజు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ లో అంబటిపల్లికి వెళ్లనున్నారు. మంథని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీలో ఓ పిల్లరు కుంగిపోవడంతో దాన్ని చూసేందుకు రాహుల్ గాంధీ వెళ్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేయబోతున్నారు.


మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం (నవంబర్ 1న) హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. గురువారం (నవంబర్ 2) మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్లను రాహుల్ గాంధీ పరిశీలించనున్నారు. అనంతరం అంబటిపల్లి కొత్త గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేయబోయే మహిళా సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొంటారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల గురించి మహిళలకు వివరించనున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు.