Telangana Assembly Elections : తెలగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడి ప్రచారం చేస్తున్నారు. భారీ అనుచరగణంతో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆసక్తికర ఫైట్ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ (Nalgonda Disrtrict)లోని నాగార్జున సాగర్(Nagarjunasagar). ఇంకోటి ఉమ్మడి కరీంనగర్(Karimnagar District ) జిల్లాలోని కోరుట్ల సెగ్మెంట్. నాగార్జునసాగర్, కోరుట్ల స్థానాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా...ప్రత్యర్థులుగా మళ్లీ మళ్లీ వాళ్లే తలపడుతున్నారు. ఇది కొన్ని ఏళ్లుగా జరుగుతూ ఉంది. గత కొన్నేళ్లుగా తండ్రులు ఎన్నికల్లో పోటీ చేస్తే, నేడు వారి తనయులు అమితుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారు.
సాగర్ లో జై వీర్ వర్సెస్ నోముల భగత్
నాగార్జునసాగర్! ఈ నియోజకవర్గం జానారెడ్డి(Janareddy) అడ్డా. 1983 నుంచి 2014 వరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు మంత్రిగానూ పని చేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో చాలకుర్తి నుంచి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోటీ చేశారు. 2014, 2018 ఎన్నికల్లో జానారెడ్డి కాంగ్రెస్ తరపున, నోముల నర్సింహయ్య బీఆర్ఎస్ తరపున తలపడ్డారు. 2014లో నోములపై జానారెడ్డి గెలిస్తే...2018లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్య విజయం సాధించారు. నోముల హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జానారెడ్డిపై నోముల నర్సింహ్మయ్య (Nomula narsimhaiah) తనయుడు భరత్ గెలుపొందారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భరత్ అధికార పార్టీ నుంచి బరిలోకి దిగితే...మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు జైవీర్ తొలిసారి సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నోముల భరత్ రెండోసారి గెలుస్తారా? లేదంటే జైవీర్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
కోరుట్లలో జువ్వాది వర్సెస్ కల్వకుంట్ల
కోరుట్ల నియోజకవర్గం ఉద్యమాలకు పురిటిగడ్డ. రజాకార్లను ఎదురించిన నేలగా గుర్తింపు పొందింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 సెగ్మెంట్లలో ఇదొకటి. 2009 డీలిమిటేషన్‌లో భాగంగా ఏర్పడ్డ కోరుట్లలో మొదట్నుంచీ వెలమ సామాజికవర్గానిదే ఆధిపత్యం. నాలుగుసార్లు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విజయబావుటా ఎగురవేశారు. అంతకు ముందున్న మెట్‌పల్లి నియోజకవర్గంతో చూసుకున్నా వారి హవానే నడిచింది. చెన్నమనేని విద్యాసాగర్‌రావు బీజేపీ నుంచి మూడుసార్లు అసెంబ్లీకి వెళ్లారు. ఒకప్పటి కాషాయం కంచుకోటను క్రమంగా కారు పార్టీ కబ్జా చేసేసింది. 2009 నుంచి బీఆర్‌ఎస్ జైత్రయాత్రే నడిచింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010లో ఉపఎన్నికల్లోనూ గులాబీ పార్టీ సత్తా చాటింది. అంతకుముందు కంటే నాలుగింతల మెజారిటీ ఇచ్చి తెలంగాణవాదాన్ని చాటారు. 2009, 2010 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి జువ్వాది రత్నాకర్‌రావు తలపడ్డారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాసాగర్‌రావును జువ్వాది తనయుడు నర్సింగరావు ఢీ కొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు రెండుసార్లు రత్నాకర్‌రావుపై, రెండు సార్లు నర్సింగరావుపై గెలుపొందారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ తరపున, జువ్వాది నర్సింగరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నాడు తండ్రులు తలపడితే నేడు తనయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. కల్లకుంట్ల కుటుంబం పట్టు నిలుపుకుంటుందా ? లేదంటే బీఆర్‌ఎస్‌కు జువ్వాది నర్సంగరావు చెక్ పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.