Siricilla Textile Production Industry: ఏ పరిశ్రమ అయినా ఆధునిక శైలికి మారితేనే మనుగడ సాధ్యం... అలాంటిది వస్త్రోత్పతి రంగంలో ప్రాముఖ్యత కలిగిన సిరిసిల్లలోని వస్త్ర ఉత్పత్తిదారులు ఇప్పటికీ పాత యంత్రాలతో పనిచేయడం సమస్యాత్మకంగా మారింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని మరమగ్గాలు అన్ని కూడా 50 సంవత్సరాల క్రిందటివి. ఇక్కడ ఉత్పత్తులకు ఆదరణ లేదు. ప్రభుత్వ ఆర్డర్ల కొద్ది రోజుల ఉపశమనాలకే పరిమితం అయ్యాయి. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్న పరిశ్రమలు చెన్నై, గుజరాత్ మహారాష్ట్ర లోని పరిశ్రమలు జాతీయ అంతర్జాతీయ విపణిలో మంచి గుర్తింపు పొందాయి.
పూర్తి ఆధునికీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు
మన దగ్గర వసతులు లోపించడంతో రోజురోజుకు సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రభుత్వం పూర్తి ఆధునికీకరణకు ప్రణాళికలు చేస్తుంది. దాని కోసం టి- ట్యాప్ తెలంగాణ టెక్సో టైల్స్ అండ్ అపారెల్ పాలసీని తీసుకొచ్చింది. దీని అమలుకు ముందు చేనేత జౌళి శాఖ, టెక్స్టైల్ పార్క్ లోని యజమానులు నెల రోజుల క్రితం వేరువేరుగా మహారాష్ట్ర, చెన్నైలోని పరిశ్రమలను అధ్యయనం చేసి వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్రాలను తయారు చేయాలంటే వస్త్ర పరిశ్రమ పూర్తి ఆధునికీకరణ తప్పనిసరి. ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల, కరీంనగర్ లోనే 38 వేలకు పైగా మర మాగ్గాలు ఉన్నాయి. ఇప్పుడున్న మరమగ్గాల స్థానంలో ఎయిర్ జెట్, వాటర్ జెట్ మగ్గాలను తీసుకురానున్నారు. దీంతో వస్త్ర ఉత్పత్తితో పాటుగా నాణ్యత కూడా పెరగనుంది. సిరిసిల్ల పట్టణంలోని పురాతన మగ్గాలను ఇప్పటికే తుక్కు కింద అమ్ముతున్నారు. ఇప్పుడున్న ఒక మరమగ్గం షిఫ్టుకి 25 మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేస్తే, ఒక ఎయిర్ జెట్ మగ్గం రెవల్యూషన్ ఫర్ మినిట్ ను బట్టి 250 మీటర్ల పైన ఉత్పత్తి చేస్తుంది. ఒక్కో మగ్గం ధర రూ. 50 లక్షల వరకు ఉంటుంది.
మహిళలకు 35, పురుషులకు 25 శాతం రాయితీ..
ఇళ్లల్లో, చిన్న చిన్న షెడ్లలో సగటున 8 నుంచి 40 పైన మగ్గాలు ఉన్నాయి. ఉన్న మరమగ్గాల కొనుగోలుకు మహిళలకు 35 శాతం పురుషులకు 25 శాతం ప్రభుత్వం రాయితీ ప్రభుత్వం ఇవ్వనుంది. విద్యుత్ వినియోగంలో రాయితీ అందిస్తారు. 2017 లో ప్రవేశ పెట్టిన పవర్ టెక్స్ ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వంద శాతం రాయితీపై మరమగ్గాల ఆధునీకరణ చేశారు. రానురాను ఈ పథకంలో కేంద్రం వాటా తగ్గిస్తూ వచ్చింది. 2021 వరకు ఉన్న ఈ పథకం లో కేవలం 18 వేల మరమగ్గాలు మాత్రమే ఆధునీకరించి, వాటిలో ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, డాబీ, జాకాట్ వంటి పరికరాలు అమర్చారు. వీటితో నాణ్యతలో పెద్దగా మార్పు రాలేదు. ఇది కేవలం బతుకమ్మ చీరలు తయారీకి మాత్రమే పరిమితం అయ్యాయి.
ప్రైవేట్ ఆర్డర్లు రాకపోగా కార్మికులకు పని భారం తర్వాత చాలా రోజుల వరకు పరికరాలను పక్కన పెడుతున్నారు. కొత్తదనానికి తగ్గట్టుగా నాణ్యమైన వస్త్రాల ఆర్డర్ లు రాకపోవడమే ఇందుకు కారణం. టెక్స్ టైల్ పార్కులో ఇప్పటికే 20 మంది యజమానులు ఆధునిక ఏర్పాటు ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేసుకుంటున్నారు. టెక్స్ టైల్ పార్కును నమూనాగా తీసుకొని ఆధునీకరించాలని చూస్తున్నారు. దీనికి ప్రభుత్వం యూనిట్ రాయితీ 10 శాతం పెంచాలి. ఇక్కడ విద్యుత్ ఒక యూనిట్ రూపాయలు 7.75 గా ఉంది. దీనిలో రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయకుండా ఉంటే చిన్న వ్యాపారులు సైతం కొనుగోళ్ల కోసం త్వరపడే అవకాశం ఉంది.