Karimnagar News : ప్రైవేట్ పంచాయితీలో జోక్యం చేసుకున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై వేటు పడింది. బాధితుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ సీసీఎస్ సీఐ శివకుమార్ పై చర్యలు తీసుకున్నామని డీజీపీ కార్యాలయం తెలిపింది.


అసలేం జరిగింది?


హజురాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీకి సంబంధించి భాగస్వామ్య వివాదం తలెత్తింది. ఎన్.రాజు అనే భాగస్వామి సెప్టెంబర్ 24, 2021లో హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ వివాదంపై ఫిర్యాదు చేయగా క్రైమ్ నెంబర్ 138/2021 ద్వారా కేసు నమోదు చేసిన పోలీసులు సరైన ఆధారాలు లేవని క్లోజ్ చేశారు. తిరిగి ఇటీవల రాజు మరోసారి హుజురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 134/2022 క్రైమ్ నెంబర్ లో మరో కేసు నమోదు చేసి కరీంనగర్ సీసీఎస్ కు బదిలీ చేశారు. అయితే కేసు విచారణలో భాగంగా సీసీఎస్ సీఐ శివ కుమార్ వేధింపులకు గురి చేయడంతో పాటు నేరుగా బెదిరింపులకు దిగారు. రాజుకు రూ. 90 లక్షలు ఇవ్వాలని కాలేజీకి చెందిన మరో భాగస్వామి సారయ్యకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు పీడీ యాక్ట్ పెడతానని బెదిరించాడు సీఐ.  అంతేకాకుండా సారయ్య మామ అయిన సాదినేని సూర్యనారాయణను ఈ ఏడాది జూన్ 21,  25 తేదీల్లో బెదిరించి రూ. 40 లక్షలు ఇవ్వాల్సి ఉందని స్టాంప్ పేపర్ పై సంతకాలు చేయాలని హెచ్చరించారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు సారయ్య మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించి కరీంనగర్ సీపీ, సీసీఎస్ సీఐలపై చర్య తీసుకోవాలని కోరారు.


రంగంలోకి మానవ హక్కుల కమిషన్ 


ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హ్యుమన్ రైట్స్ కమిషన్ డీజీపీని ఆదేశించింది. దీంతో డీజీపీ రామగుండం సీపీని విచారణ అధికారిగా నియమించారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన రామగుండం సీపీ.. డీజీపీ నివేదిక ఇచ్చారు. సీసీఎస్ సీఐ శివ కుమార్ ఈ ఏడాది మే 18న తన సిబ్బంది హసనుద్దీన్(హెచ్సీ), కె మహేష్(పీసీ)లను హన్మకొండలోని సారయ్య ఇంటికి పంపించి కరీంనగర్ కు పిలిపించుకుని హెచ్చరించారని, తిరిగి అదే నెల 20న రహీం పాషా (ఎస్ఐపీ), హెడ్ కానిస్టేబుల్ హసనుద్దీన్, పీసీ లక్ష్మీపతిలను సారయ్య సోదరుడు సదయ్య, బావమరిది సాదినేని రవికిరణ్ ఇంటికి పంపించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రవికిరణ్ తండ్రి సూర్యనారాయణ సీసీఎస్ కు వచ్చి తన కొడుకుని విడిచిపెట్టాలని వేడుకోగా రాజుకు రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయాలన్నారు.


మరోసారి బెదిరింపులు


జులై 27న మరోసారి ఏఎస్ఐ వీరయ్య, హెచ్సీ హసనుద్దీన్, పీసీ మహేష్ లను మరోసారి హన్మకొండలోని సారయ్య ఇంటికి పంపించారు సీఐ. సారయ్య ఇంటికి వెళ్లిన పోలీసులు వెంటనే డబ్బులు చెల్లించాలని వార్నింగ్ ఇచ్చారు. సెల్ ఫోన్లో సారయ్య ఈ వ్యవహారాన్ని అంతా కూడా రికార్డు చేశారని విచారణ అధికారి ఇచ్చిన నివేదికలో తెలిపారు. దీంతో సీసీఎస్ సీఐ శివ కుమార్ ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించకుండా ఫిర్యాదుదారుకు అండగా నిలుస్తూ కోర్టు బయట సెటిల్ చేసేందుకు ప్రయత్నించారని నివేదికలో వివరించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా సీసీఎస్ సీఐ శివ కుమార్ ను సస్పెండ్ చేశామని డీజీపీ హెచ్ ఆర్ సీకి ఇచ్చిన లేఖలో తెలిపారు.  అయితే ఈ వ్యవహారంతో కరీంనగర్ సీపీకి ఎలాంటి సంబంధం లేదని కూడా విచారణ నివేదికలో తేల్చారని డీజీపీ వివరించారు.