ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి కొత్త ఛైర్మన్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు నియమించింది. వచ్చే నెల 7వ తేదీతో ప్రస్తుత ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావును నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల అయ్యే అవకాశం ఉంది. 


దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పదవీ కాలం గత ఏడాదితోనే ముగిసినా ప్రభుత్వం ఓ ఏడాది పొడిగించింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనాథ్‌ రెడ్డిని 2019లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. 2021 నవంబరు 7తో ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి మరో ఏడాదిపాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు మరో ఏడాది పాటూ శ్రీనాథ్ రెడ్డి పదవిలో కొనసాగారు. తాజాగా ఈ ఏడాది నవంబరు 7తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. 


కొమ్మినేని శ్రీనివాసరావు సుమారు 33 సంవత్సరాల పాటు వివిధ వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్ళలో జర్నలిస్టుగా పనిచేశారు. 1978లో ఆయన ఈనాడులో చేరారు. విజయవాడ, తిరుపతి తర్వాత హైదరబాద్ లో పని చేశారు. ఆయన 2002లో ఆంధ్రజ్యోతిలో చేరారు. నాలుగున్నర సంవత్సరాలు ఆంధ్రజ్యోతి పత్రికకు బ్యూరో చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.


ఆధ్రజ్యోతిలో పనిచేసిన తరువాత అతను ఎన్టీవీ ఛానెల్‌ లో చేరారు. కొద్దినెలలలోనే ఆ ఛానెల్ నుండి తప్పుకుని.. టీవీ 5 ఛానెల్ లో పొలిటికల్ ఎడిటర్ గా చేరారు. ఆ ఛానెల్‌కు ఎడిటర్ గా కూడా పనిచేసారు. ఆ ఛానెల్ లో రెండున్నరేళ్ళు పనిచేసి తరువాత మళ్లీ ఎన్టీవీలో ప్రధాన ఎడిటర్ గా చేరారు. అక్కడే లైవ్ షో విత్ కేఎస్ఆర్ తో పేరు తెచ్చుకున్నారు. కొన్నేళ్ల క్రితం సాక్షి టీవీలో చేరారు. లైవ్ షో విత్ కేఎస్ఆర్ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా కొనసాగించి గుర్తింపు పొందారు.