ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతూ ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. తెలంగాణలో కూడా క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. దీని నుంచి తమను తాము కాపాడేందుకు ప్రజలు చొరవ తీసుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌ డౌన్ మళ్ళీ ప్రారంభమైంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామవాసులు తమకు తామే లాక్ డౌన్ విధించుకున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి గూడెంకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ ఉందని నిర్ధారణ అయింది. తాజాగా అతని తల్లి, భార్యలకు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. దీంతో గ్రామంలో పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయతీ తీర్మానం చేసింది. 


ఒమిక్రాన్ సోకిన ఇతను ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపురంలో ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. అక్కడ 53 మంది నమూనాలు సేకరించి, వారిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని వైద్యాధికారులు ఆదేశించారు.


గూడెం గ్రామానికి 26 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఈ నెల 16న అతడు తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతడు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోకి చేరుకున్నాక అధికారులు ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. సోమవారం అతనికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా తేలింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులకు సోమవారం సమాచారం అందింది.


దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ రావుతో పాటు పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సంజీవరెడ్డి, ఇతర వైద్య సిబ్బంది వెంటనే గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంటనే వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. 


సిరిసిల్ల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు వైద్యాధికారులు ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు చేపట్టారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఇంటికి చేరాక ఎవరెవరిని కలిశారో ఆరా తీశారు. మొదట ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని, అతన్ని కలిసిన మరో ఏడుగురిని క్వారంటైన్‌ చేశారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో పాటుగా దుబాయ్ నుంచి వచ్చిన చిప్పలపల్లికి చెందిన మరో వ్యక్తి ఇంటిని కూడా క్వారంటైన్‌ చేశారు. గూడెం గ్రామ ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. 


క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి.. హైకోర్టు ఆదేశాలు
ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ ఆందోళన ఉన్నందున క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. వచ్చే వారం రోజులు వేడుకలు ఉన్నందున ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.


Also Read: Hyderabad: కొన్నేళ్లుగా సహజీవనం, అతని కోరికను ఒప్పుకోని ఆమె.. చివరికి దారుణం


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. IMD హెచ్చరికలు, ఇక్కడ గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా..


Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి