తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి రెండు రోజులపాటు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని వేడి చేసుకుని తాగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు సూచించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఈ వానాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షం కురుస్తున్న సమయాలలో అత్యవసరమైతే తప్ప, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని అలర్ట్ చేశారు.


జనగామ కలెక్టరేట్‌లో సమీక్ష..
విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల తాజా పరిస్థితులు, పునరావాస చర్యలపై మంత్రి ఎర్రబెల్లి జనగామ కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాలపై ఫోకస్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 14.29 సె. మీ. వర్షపాతం నమోదు అయిందన్నారు. వర్షాకాలంలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలుతాయని, ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు గుర్తించి ప్రజలను అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పంపాలన్నారు. పునరావాస చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షాల తర్వాత అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు.


మరికొన్ని రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఆయన.. ప్రజలు నీటిని వేడి చేసుకుని తాగడం మంచిదని సూచించారు. తద్వారా వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని.. దాంతో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని, వరదలతో ఇబ్బంది పడకూడదన్నారు.

కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిండుతున్న జలాశయాలు..
నిజామాబాద్ జిల్లాలో అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షం కురుస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్తాయికి చేరుకుంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లోకి వరద కొనసాగుతూనే ఉంది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నా ప్రవాహం పెరుగుతూనే ఉంది. కరీంనగర్ పట్టణానికి సమీపంలో గల లోయర్ మానేరు డ్యామ్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 9, 10, 11, 12 గేట్ల ద్వారా దాదాపు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.ప్రస్తుతం 30వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కెపాసిటీ 24 టీఎంసీలుగా ఉంది