జనసేన పార్టీ ప్రచారం రథం కదలింది. కొండగట్టు అంజన్న గుడిలో ప్రత్యేక పూజలు చేసుకున్న వారాహి ఎన్నికల డ్యూటీలోకి దిగింది. ఈ ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరిన పవన్ కల్యాణ్‌... సిద్దిపేట, కరీంనగర్‌ మీదుగా కొండగట్టు చేరుకున్నారు. దారి పొడవును అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. హైదరాబాద్‌ దాటే క్రమంలో కాసేపు ఆయన ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ దాటివెళ్లిన తర్వాత రోడ్డుకు ఇరువైపుల పవన్ కల్యాణ్‌ను చూసేందుకు జనం భారీగాతరలి వచ్చారు. అక్కడక్కడ కారులో నుంచి పైకి వచ్చిన పవన్... అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.  


సుమారు  11 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న జనసేన అధినేత.. అక్కడ వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు, వేదపడింతులు ఘన స్వాగతం పలికారు. ముందుగా అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్‌... అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపారు జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్. 


వారాహికి పూజలు చేస్తున్న క్రమంలోనే వేదపండితులతోపాటు ఆయన కూడా మంత్రోచ్చరణ చేశారు. పూజలు సందర్భంగా పవన్ కల్యాణ్‌.. కాషాయ ఉత్తరీయం ధరించారు. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించి, వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించారు వేద పండితులు. ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పండితులు  విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టారు. అనంతరం వారాహిని ప్రారంభించారు. 


పూజలు పూర్తైన తర్వాత పవన్ కల్యాణ్‌ వేదపడింతుల ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయల్దేరారు. ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు. అనంతరం తన వాహనంలోనే నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టుకు చేరుకున్నారు. కాసేపట్లో అక్కడ జనసేన తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అక్కడే లంచ్‌ కూడా పవన్ చేయనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు... ప్రజలకు అండగా ఉండాల్సిన అంశాలపై కార్యకర్తలకు, పార్టీ లీడర్లకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.


పార్టీ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడి నుంచి బయల్దేరతారు. నేరుగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి అనుష్టుప్ నారసింహ యాత్ర చేపడారు. ఈ యాత్రలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని 32 నరసింహ క్షేత్రాలను దర్శించుకోనున్నారు పవన్ కల్యాణ్. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ వస్తారు. జనసేనాని పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. 


తెలంగాణలో పోటీచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జనసేన చేస్తోంది. తెలంగాణలో కూడా పోటీచేసేందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ వెల్లడించారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి అధినేతకు నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనలు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.


ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోకి జనసేన నేతలే ఎక్కువగా చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.. ఇది పవన్ కల్యాణ్ ను బలహీనపర్చడానికేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తెలంగాణలో కాపు సామాజికవర్గం ఓట్లను తమ పార్టీకి ఆకర్షించి.. కేసీఆర్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో కాపు సామాజికవర్గ ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజికవర్గం ఎవరికి అండగా నిలిస్తే వారికి అధికారం లభిస్తుందన్న అంచనా ఉంది. ఏపీలో కాపుల్ని ఆకట్టుకుంటే.. తెలంగాణలో ఆ వర్గం కూడా బీఆర్ఎస్‌కు అండగా ఉంటుందని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 


కారణం ఏదైనా పవన్ కల్యాణ్.. తెలంగాణ రాజకీయాల్లో  బీఆర్ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేయడం లేదు. గతంలో   బీజేపీతో పొత్తు ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ కోసం అభ్యర్థుల్ని విరమించుకున్నారు. కానీ తర్వాత పొత్తు చెడిపోయింది. గౌరవం ఇవ్వడం లేదని.. అలాంటి చోట పొత్తు ప్రశ్నే ఉండదని పవన్ తేల్చి చెప్పారు. బీజేపీ నేతలు కూడా తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పవన్ చేయబోయే రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ పర్యటనకు వచ్చే స్పందనను బట్టి తదుపరి నిర్ణయాలను ఆ పార్టీ నేతలు తీసుకునే అవకాశం ఉంది.