Kondagattu Temple: జగిత్యాల జిల్లాలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులను కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ లో జగిత్యాల జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి సన్నిధికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం... భారతదేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పిన ఎమ్మెల్యే


కొండగట్ట ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాల అభివృద్ధికి చిన్నచూపు చూశారని తెలిపారు. సీఎం ప్రత్యేక దృష్టితో యాదాద్రి, వేములవాడ దేవస్థానాలు అభివృద్ధి చెందాయని వెల్లడించారు. సీఎం ప్రత్యేక చొరవతో కొండగట్ట దశ, దిశ మారనుందని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వేములవాడలో పార్కింగ్ ఇబ్బందులు తప్పాయని పేర్కొన్నారు. హిందుత్వ వాదిగా చెప్పుకునే ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. 






అభివృద్ధి పట్ల చిత్తసుద్ధి ఉంటే కేంద్రం నుంచి తీసుకురావాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెల్లడించారు. కొండగట్టుకు నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.