Ganesh Chaturthi 2024:గణపతి నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు ఊరూవాడ సందడే సందడి. చిన్నచిన్న పల్లెల నుంచి మొదలుకొని పెద్దపెద్ద నగరాల వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే ప్రతిఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే కొంతమంది భక్తులు డిఫరెంట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. వివిధ రకాల ప్రతిమలతో వినాయక ప్రతిమలు పెట్టి పూజించుకుంటారు.


ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా భక్తుల ఆలోచన తగ్గట్టు విగ్రహాలు తయారు చేస్తుంటారు. మసాలా వినాయకుడు డాక్టర్ వినాయకుడు పోలీస్ వినాయకుడు అంటూ రకరకాల వినాయక ప్రతిమలు తయారు చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఆ తొమ్మిది రోజులపాటు పూజలు చేస్తుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కరీంనగర్‌లో ఓ వ్యక్తి వినాయకుడిని ప్రతిష్టించారు. సొంత ఖర్చులతో సమాజంలో జరిగే ఘటనలను కళ్లకు కట్టేలా చూపించే ఆ వ్యక్తి ఈసారి కూడా అలాంటి ప్రయత్నం చేశాడు. 



చందాల డబ్బుతో ఘనంగా...


వినాయక చవితి ఉత్సాహాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలంటే చిన్న విషయం కాదు. సమయం, భక్తీశ్రద్ధలతోపాటు ఖర్చు కూడా పెట్టాల్సి ఉంటుంది. అందుకే తలో చేయి వేయమని ఊళ్లల్లో, కాలనీల్లో చందాలు వసూలు చేస్తుంటారు. ఈ డబ్బలతోనే 9 రోజుల పాటు ఘనంగా వినాయక ఉత్సవాలు చేస్తారు. కొందరు డబ్బులు ఇవ్వకుండా విగ్రహాల ఖర్చు భరిస్తుంటారు. 


కరీంనగర్‌లో డిఫరెంట్‌


ఇప్పుడు కరీంనగర్‌లో మనం తెలుసుకునే వినాయకుడి వేడుకల మాత్రం పూర్తిగా భిన్నమైనవి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన శ్యామ్... టీం ఇండియా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. శ్యామ్‌తోపాటు తన స్నేహితులు మాత్రమే గణపతి నవరాత్రి ఉత్సవాల ఖర్చు భరించేలా నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలంగా ఎప్పుడు ఉత్సవాలు వచ్చినా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో విగ్రహం తయారు చేస్తుంటారు. సమాజంలో జరుగుతున్న ఘటనల దృశ్యరూపంతో ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.  ఒక్కో సంవత్సరం ఒక్కో విగ్రహాన్ని పెట్టి ఆకట్టుకుంటారు. 


ఏడాదికో కాన్సెప్టు


రైతులు పడుతున్న కష్టాలను చూసి రైతే రాజుగా ఉండాలని రైతుల కోసం ఫార్మర్ వినాయకుడు, నిత్యం వైద్య సేవలో ఉండే వైద్యుల కోసం డాక్టర్ వినాయకుడు, ఎల్లప్పుడూ ప్రజల రక్షణ కోసమై పనిచేసే పోలీసుల కోసం పోలీస్ వినాయకుడు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజల సమస్యల కోసం ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల కోసం రిపోర్టర్ వినాయకుని పెట్టారు. ఈసారి మాత్రం అంతరించిపోతున్న కమ్మరి వృత్తిని ఎవరూ మర్చిపోకుండా ఉండేందుకు దేవుడే దిగివచ్చి కమ్మరి వృత్తి చేస్తే ఎలా ఉంటుందో నేటి తరానికి అవగాహన కల్పిస్తున్నారు.


మార్పు కోసం ఇదో ప్రయత్నం


కరీంనగర్ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ కమ్మరి వినాయక విగ్రహాలను చూసేందుకు వందల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. స్వామిని దర్శించుకుని మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నట్టు చెబుతోంది పూజా కమిటీ. సమాజంలో మార్పు తీసుకురావడంలో ఇదో ప్రయత్నంగా చెబుతున్నారు శ్యామ్ ఓజా. 


Also Read: నీటిలో మునిగిన కార్లు చౌక ధరకు కొంటున్నారా? అవి పని చేస్తాయో లేదో తెలుసుకోవడం ఎలా?