క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సమాజ సేవను సామాజిక భాధ్యతగా గుర్తించాలని, ప్రజలకు సేవ చేయడమే పవిత్ర వృత్తిగా భావించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగునూర్ లోని ప్రతిమ వైద్య కళాశాలలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్, ఏ.ఎన్.ఎమ్ లు, పంచాయితీ కార్యదర్శులు, పోలీసు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ సూపర్ వైజర్లు, పబ్లిక్ హెల్త్ సెంటర్ సిబ్బందికి లైఫ్ సేవింగ్ టెక్నిక్ ( సీపీఆర్ & ఏఈడీ) పై శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా సిపిఆర్ తీరును అడిగి తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా సిపిఆర్ చేశారు.
అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కార్డియాక్ అరెస్టులతో చాలా మంది యువకులు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మరణస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మరణాలు ఇక ముందు జరగొద్దని... ఒకవేళ కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు వచ్చినా వారిని కాపాడాలని సంకల్పించి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి సీపీఆర్ పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. భూమిపై మనం ఎవరము శాశ్వతం కాదని ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని.. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినా కొనలేనిది ప్రాణం మాత్రమేనని.. మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
జీవనశైలి మార్పులతో గుండెపోటు మరణాలు..
క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ సేవచేసే అవకాశం దేవుడు మీ అందరికీ కల్పించాడని.. దానిని పవిత్ర వృత్తిగా భావించాలని మంత్రి గంగుల అన్నారు. కార్డియాక్ అరెస్టు వచ్చిన వారందరినీ సీపీఆర్ చేసి బతికించలేకపోయినా, ఒక్క ప్రాణాన్ని కాపాడినా మానవ జన్మకు ఇంతకు మించిన తృప్తి ఉండదన్నారు. ఒకప్పుడు చేసే పనుల వల్ల శారీరక శ్రమ ఉండి ఆరోగ్యంగా ఉండేవాళ్ళమని, ఇప్పుడు తినే అలవాట్లు, ఆటలకు, పనులకు దూరమై శారీరక శ్రమ అనేది లేకుండా పోయిందని.. అందుకే అకాల మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. నేటి కాలంలో కార్డియాక్ అరెస్టులకు చాలా కారణాలు ఉన్నాయని, ప్రధానంగా రక్తంలోని కొవ్వు కార్డియాక్ అరెస్టులకు ప్రధాన కారణం అని అన్నారు. నేటి రోజుల్లో ఎలాంటి అలవాట్లు లేని చిన్నపిల్లలకు కూడా కార్డియాక్ అరెస్టు కావడంపై ఆలోచించాలని, కరోనా తర్వాత మన శరీరంలో కొన్ని మార్పులు జరిగాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో కార్డియాక్ అరెస్టులతో మృత్యువాత పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం విద్యార్థులకు కాలేజీల్లో నిర్బంధ వైద్య పరీక్షలు చేయిస్తున్నామని అన్నారు.
కార్డియాక్ అరెస్టులపై తెలంగాణలోనే కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమంగా స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రజల ప్రాణాలు కాపాడడమే మా ధ్యేయమని.. ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యం అని అన్నారు. సీపీఆర్ పై ప్రతి ఒక్కరిలో అవగాహన రావాలని, దీనిని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత గా భావించి సీపీఆర్ ను నేర్చుకోవాలని సూచించారు. ఈ వైద్య పరీక్షలలో లిపిడ్ ప్రొఫైల్... బీపీ, షుగర్, ఈసీజీ... 2డి ఇకో లాంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. యువకుడి రక్తం పరిస్థితి ఎలా ఉంది.. స్క్రీనింగ్, ఈసీజీ పరీక్షలు ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా మందులు ఇచ్చి ప్రాణాన్ని కాపాడాలని నిర్ణయించామని అన్నారు. నగరంలోని రక్షణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కూడా అడ్రెసింగ్ సిస్టం ద్వారా కూడా గుర్తించి త్వరలో వైద్యం అందిస్తామని అన్నారు. సీపీఆర్ పై క్షేత్ర స్థాయిలో పని చేసే అన్ని రంగాల వారికి శిక్షణ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, మేయర్ సునీల్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఎంపీపీ తిప్పర్థి లక్ష్మయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జువేరియ మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు.