ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఇంటిలిజెన్స్ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సామాన్యుల విషయం పక్కనపెడితే ఏకంగా పోలీసులని సైతం తన సిఫార్సు లేఖలతో ఇబ్బంది పెట్టిన వైనం ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది. దీంతో వారు విషయాన్ని మంత్రుల దృష్టికి అలాగే ఆ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వ పెద్దలకు అందించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి.


అసలేం జరిగింది?
సాధారణంగా ఒక ఎస్సై కానీ సీఐ కానీ బదిలీ జరగాలంటే ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇస్తుంటారు.. ఇదే అదనుగా తీసుకుని ఓ ఎమ్మెల్యే లక్షల రూపాయలు దండుకుని పోలీసు శాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాడు. ఒక పోస్టింగ్ కోసం ముగ్గురు అధికారుల నుండి డబ్బులు తీసుకొని మరో అధికారికి పోస్టింగ్ కల్పించడంతో వారంతా కక్కలేక మింగలేక పరిస్థితిని వారి సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మొదట ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం ఒక సీఐతో 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ గా 10 లక్షలు తీసుకున్న సదరు ఎమ్మెల్యే తర్వాత మరో సీఐకి అదే పోస్ట్ ని  18 లక్షలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ముందు డబ్బులు ఇచ్చిన అధికారి ఏం చేయాలో అర్థం కాక చివరికి అడిగితే మళ్లీ చూద్దాంలే అంటూ దాటవేయడంతో డబ్బుల కోసం ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది.


మరో పోస్ట్ కి సైతం ఎమ్మెల్యేతో సీన్ ఇలాంటిదే మళ్లీ రిపీట్ అయింది. మొదట ఒక అధికారి నుండి 10 లక్షల కు ఫిక్స్ అయి ఇంకొక సీఐ నుండి 13 లక్షలు ఒప్పందం చేసుకొని అడ్వాన్స్ గా మూడు లక్షలు తీసుకొని మరో సీఐకి సిఫార్సు లేఖని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటి ఇన్స్పెక్టర్ వెళ్లి ఎమ్మెల్యేను అడగగా 15 లక్షలు ఇస్తేనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తానని చెప్పడంతో ముందు ఇచ్చిన 10 లక్షలు కూడా వెనక్కి రావేమో అని మరో ఐదు లక్షలు కూడా సమర్పించినట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది.


ఎందుకీ పరిస్థితి
రాజకీయ నేతల సిఫార్సు లేఖలు బదిలీల్లో చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. ఒక ఎమ్మెల్యే ఇచ్చే సిఫార్సు లేఖను బేస్ చేసుకుని పోస్టు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి లేఖలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఈ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. నియోజకవర్గంలో భారీ డిమాండ్ ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎస్సై పోస్టింగ్ కోసం ఒకరికి 11 లక్షలకు కమిట్ మెంట్ ఇచ్చిన సదరు ఎమ్మెల్యే లోకల్ లీడర్ ద్వారా నాలుగు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలిసింది. తర్వాత పోస్ట్ ఖాయం కావడంతో మిగతా మొత్తం కూడా చెల్లించాడు సదరు ఎస్సై. అయితే ఆరు నెలల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తన మాట సరిగా వినడం లేదని భావించిన ఆ ఎమ్మెల్యే మరో ఎస్ఐతో 15 లక్షలకు బేరం కుదుర్చుకుని సిఫార్సు లేఖ ఇచ్చారు. 


ఇక ఇదే మండలానికి పక్కనే ఉన్న మరో కీలకమైన పోలీస్ స్టేషన్ కి కూడా కరీంనగర్ త్రీ టౌన్ ఎస్సై నుండి 10 లక్షలకు కమిట్మెంట్ ఇచ్చాడు. దాని కోసం మూడు లక్షలు అడ్వాన్స్‌గా కూడా తీసుకున్నారు. కానీ మరో 15 లక్షలకు ఒప్పందం కుదరడంతో అతనికి పోస్టింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇక ఓ మంత్రికి దగ్గరి వ్యక్తితో పోస్టింగ్ కోసం 15 లక్షలు తీసుకొని పోస్టులు ఖాయం చేశారు. ఇదంతా ఇంటలిజెన్స్ విచారణలో బయట పడింది. దీంతో పై విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా నివేదికలు తయారు చేసిన ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులకు నివేదికను వివరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.