Karimnagar Road Accident: ఉమ్మడి కరీంనగర్ బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కల్లెడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుగ్గారం మండల బీజేపీ అధ్యక్షుడు పరుశురాం మృతి చెందారు. బీరుసాని గ్రామానికి చెందిన పరుశురాం జగిత్యాల నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఘటన జరిగి ఉండొచ్చునని పోలీసులు  అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.






బుగ్గారం మండల బీజేపీ అధ్యక్షుడు పరుశురాం మృతిపట్ల కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. పరశురాం మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీజేపీ నేత పరుశురాం మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పరశురాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


హామీలపై ప్రశ్నిస్తే దాడులా..? బండి సంజయ్ ఫైర్
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తారా, దాడులు చేసేందుకే ప్రజలు మిమ్మల్ని గెలిపించారా అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. గురువారం  సాయంత్రం దాడికి గురైన బీజేపీ నాయకులను ఇస్సాపల్లిలో ఆయన పరామర్శించారు. నిజామాబాద్‌లోని నందిపేట్‌లో మాట్లాడిన ఆయన.. చేస్తున్నది తప్పు అని ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు.


సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై కొందరు గూండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి దాడులు కొత్త కాదని, ఇలాంటి వాటికి బీజేపీ పారిపోయే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. నిరుద్యోగ భృతి, పీఆర్సీ, పంట కొనుగోళ్లు, 317 జీవో కోసం బీజేపీ నేతలు పోరాడుతున్నారని.. ప్రజల పక్షాన నిలిచిన తమ నేతలపై దాడులు చేయడం సబబు కాదన్నారు. రాష్ట్రం వచ్చేందుకు సైతం బీజేపీ మద్దతు ఇచ్చిందని, సీఎం కేసీఆర్ కనీసం ఓటింగ్‌లో కూడా పాల్గొనలేదని బండి సంజయ్ అన్నారు.


Also Read: Horoscope Today 28 January 2022: ఈ మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి


Also Read: Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలే.. తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు