పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో మళ్లీ కరోనా కలకలం రేగుతోంది. గత రెండు రోజులలో అకస్మాత్తుగా కేసుల సంఖ్య పెరిగింది. ఒకవైపు విపరీతమైన రద్దీతో కూడిన పారిశ్రామిక ప్రాంతం కావడం.. మరోవైపు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కేసుల సంఖ్య అమాంతంగా పెరిగినట్లుగా తెలుస్తోంది. పండుగలను కూడా అంతా కలిసి జరుపుకునే సంప్రదాయం ఉన్నందున కూడా వైరస్ వ్యాప్తి అధికం కావడానికి కారణంగా తెలుస్తోంది. రామగుండం ప్రాంతంలో దాదాపుగా సింగరేణి కుటుంబాలన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి. దీంతో వ్యాప్తి ఎక్కువై అకస్మాత్తుగా కేసుల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తోంది. 


కొత్తగా వచ్చిన ఓమిక్రాన్ వ్యాప్తి విపరీతంగా ఉండటం.. దానికి తగ్గట్టుగా ప్రజల నుండి ఎలాంటి జాగ్రత్త చర్యలు కనిపించకపోవడంతో టెస్టుల సంఖ్య పెంచగానే ఈ ప్రాంతంలో కలవరం మొదలైంది. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో విధుల్లోకి వచ్చిన ఆయన తిరిగి వెళ్ళిపోయారు. ఇక గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోని కరోనా కేంద్రంలో ఇప్పటికే ఆరుగురు చికిత్స పొందుతున్నారు. కేవలం సోమవారం ఒక్కరోజే 1,143 టెస్టులు చెయ్యగా 310 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 


అత్యధికంగా గోదావరిఖనిలోని ఆస్పత్రి కేంద్రంలో 173 మందికి పరీక్షలు చేయగా అందులో 48 మందికి.. అలాగే రాపిడ్ టెస్ట్ కేంద్రంలో 150 మందికి పరీక్షలు చేయగా 65 మందికి.. అడ్డగుంట పల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో 71 మందికి గాను 29 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక సింగరేణి ఆర్.జి 1, 2 ఆస్పత్రుల్లో 242 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో దాదాపు సగం అంటే 119 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.


Also Read: TS High Court: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు


నిజానికి రామగుండంలో అత్యధికంగా సింగరేణి కార్మికులు ఉంటారు. వారు తమకు నిర్మించి ఇచ్చిన క్వార్టర్స్ లోనే  అతి సమీపంలో నివాసం ఉంటారు. భూగర్భంలో బొగ్గును వెలికితీత పనులు చేసే సమయంలో నేరుగా కాంటాక్ట్ లో ఉంటారు. అతి తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది పని చేస్తూ ఉండడంతో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జంక్షన్ ఉన్న రామగుండం రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ప్రజలు రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రయాణాలకు కూడా రామగుండం ఒక కేంద్రంగా మారటంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగినట్టుగా తెలుస్తోంది.


Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..


Also Read: Formula E Hyderabad : లండన్, న్యూయార్క్ అండ్ హైదరాబాద్.. "ఫార్ములా ఈ" కార్ రేసులకు వేదికగా భాగ్యనగరం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి