టెస్లా సంస్థ తయారు చేసిన కార్లు ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికాలో ఇప్పటికే నడుస్తున్న అత్యంత లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లపై ప్రపంచవ్యాప్తంగా వాహనప్రియులు మనసు పారేసుకుంటున్నారు. తమ దేశానికి ఎప్పుడెప్పుడు టెస్లా కార్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. భారత్‌లోని ప్రముఖులు కూడా టెస్లా కార్ల కోసం అంతే ఆత్రుతతో ఉన్నారు. ఆ కంపెనీ తన తయారీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. టెస్లా సంస్థ భారత్‌లో ప్రవేశించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ దశలోనే ఆ కంపెనీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందునుంచే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకోసం కేటీఆర్ టెస్లాను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్‌ను ట్విటర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌కు ఇప్పుడు విపరీతమైన మద్దతు లభిస్తోంది. ప్రముఖ జర్నలిస్టులు, వ్యాపారవేత్తలతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం కేటీఆర్‌కు మద్దతు పలుకుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఎలన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానం పలుకుతున్నారు.
Also Read: KTR Elon Musk : మస్క్ గారూ.. టెస్లాతో తెలంగాణ వచ్చేయండి..! కేటీఆర్ పిలుపు వైరల్
హీరోలు విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థ్, దర్శకులు గోపిచంద్ మలినేని, మెహెర్ రమేశ్, హీరోయిన్ జెనీలియా తదితరులు కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. దయచేసి టెస్లా కార్ల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఎలన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను మీరూ చూసేయండి.