Jagityala Micro Artist: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరో రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతి చిన్న ఎలుకల బోనుని రికార్డు టైంలో రూపొందించి అధికారికంగా గిన్నిస్ లో స్థానం సంపాదించాడు.  కేవలం 5 మిల్లీమీటర్ల పొడవు 2.5 మిల్లీ మీటర్ల వెడల్పుతో పూర్తిస్థాయిలో పనిచేసేలా 29 నిమిషాల్లోనే ఈ బోనుని తయారుచేసిన దయాకర్ గతంలో ఒక భారతీయుడు పేరు పై ఉన్న రికార్డును చెరిపేసాడు. అప్పట్లో పాత రికార్డు నమోదు చేసిన వ్యక్తి కి గంట సమయం పట్టగా అందులో సగం సమయంలోనే దయాకర్ తయారు చేయడం విశేషం. గత డిసెంబర్ రెండో తారీఖున అధికారుల సమక్షంలో వీడియో తీస్తూ, నిబంధనల మేరకు బోను తయారు చేసి గిన్నిస్ రికార్డ్ బుక్ అధికారులకు పంపగా తాజాగా దానికి సంబంధించి ప్రశంసాపత్రాన్ని దయాకర్ కి అందజేశారు


గతంలోనూ అనేక ప్రత్యేక సందర్భాల్లో గుర్రం దయాకర్ పలు రకాల సూక్ష్మ కళాఖండాలను తయారు చేశారు. శివరాత్రికి ప్రత్యేకమైన శివుడిని హిమాలయాలతో సహా గుండుసూది పై ప్రతిష్ఠించారు. ఇక వినాయకచవితికి కూడా అలాంటి కళాఖండాన్ని తయారు చేశారు. మాతృ దినోత్సవం సందర్భంగా తల్లి పిల్లల్ని ప్రతిబింబించేలా ఒక సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేసిన దయాకర్ మహిళా దినోత్సవం రోజున బాధ్యతలు మోస్తూ పరిగెత్తుతున్న ఓ మహిళ సూక్ష్మ విగ్రహాన్ని 18 గంటల్లో 0.09 మిల్లి మీటర్ల సైజులో సూది మొనపై తయారు చేసి అందరిని అబ్బుర పరిచారు. 


ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Also Read: ఫోలులు: బియ్యం గింజ సైజులో ఎలుకల బోను, అరగంటలోనే గిన్నీస్ బుక్‌లో చోటు


ఇప్పటికే పలు రకాల అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న దయాకర్ ప్రతి అంశానికి తగ్గట్టుగా ప్రజల్లో అవగాహన పెంపొందించేలా తన కళని వాడుతున్నారు. సామాజిక కోణంలో పలుమార్లు ప్రజల్లో అవగాహన పెంచడానికి తన టాలెంట్ ని వాడుతున్న తీరు చూసి జగిత్యాల లోని పలువురు ప్రముఖులు ఆయనను ప్రశంసించారు. ఈసారి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం పట్ల జగిత్యాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక జగిత్యాల వాసి రికార్డును క్రియేట్ చేయడం పట్ల ఆయనను అభినందిస్తున్నారు.


ఇక చిన్ననాటి నుండి సామాజిక స్పృహతో పెరిగిన తాను తన కళను ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన పెంపొందించడానికి వాడుతున్నానని ఇకపై కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.