Father Revenge On daughter : కూతురు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుని హ్యాపిగా ఉంటుందని కొంత మంది తండ్రులు అనుకుంటారు. కానీ కొంతమంది తమ అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందని రివెంజ్‌కు ప్లాన్ చేసుకుంటారు. ఈగో సమస్యలు దీనికి కారణం. ఆ ఈగో ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. చూసే వారికి కామెడీగా ఉంటుంది కానీ ఆ కూతురు పడే బాధ మాత్రం వర్ణనాతీతం. కరీంనగర్ ఓ తండ్రి ఏం చేశారంటే ?
ప్రేమ పెళ్లి చేసుకున్న పక్క పక్క ఇళ్లల్లో ఉండే రత్నాకర్, మమత
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లికి చెందిన మమత తన పక్కింట్లో ఉండే రత్నాకర్ అనే యువకుడ్ని పెళ్లి చేసుకుంది. అయితే అది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. ప్రేమ పెళ్లి. పక్క పక్క ఇళ్లలో ఉండటం వల్ల పరిచయం ప్రేమగా మారింది. కానీ మమత తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇరుగు పొరుగు కాబట్టి చిన్న చిన్న గొడవలు ఆ కుటుంబాల మధ్య ఉన్నాయి. ఈ కారణంగా పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే మమత మాత్రం రత్నాకర్ తోనే జీవితం అనుకుని పెళ్లి చేసేసుకుంది .
పెళ్లి ఇష్టం లేదని వారి ఇంటికి అడ్డంగా గోడ కట్టేసిన మమత తండ్రి
ఇది మమత తల్లిదండ్రులకు కోపం తెచ్చి పెట్టింది. పెళ్లి చేసుకుని తమ పక్కింట్లోనే హాయిగా ఉంటున్న కుమార్తెను వారు చూడలేకపోయారు. ఏదో ఒకటి రివెంజ్ తీర్చకోవాలని బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది సినిమాల్లో చూపించినట్లుగా వయోలెంట్ గా లేదు. కాస్త భిన్నంగా ఉంది. రత్నాకర్ ఇంటికి వెళ్లాలంటే... మమత ఇంటి మీదుగానే వెళ్లాలి. ఈ విషయం మమత తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆ దారిని సిమెంట్ రాళ్లతో నింపేశారు. దాంతో రోడ్డు మూసుకుపోయినట్లయింది. రత్నాకర్ ఇంటికి మరో దారి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై పెద్ద మనుషులు పంచాయతీ పెట్టినా మమత తండ్రి ససేమిరా అన్నారు.
గ్రామస్తులు నచ్చ చెప్పినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన మమత
గ్రామస్తులు ఎంత చెప్పినా మూర్ఖంగా రోడ్డుకు అడ్డంగా పెట్టిన రాళ్లను తీసేసే ప్రశ్నే లేదని మమత తండ్రి పట్టుబట్టారు. చాలా మందితో చెప్పి చూసినా వినకపోవడంతో మమతకు వేరే దారి లేక పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ తండ్రి ఈగో గురించి తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే మమత తండ్రి అది రోడ్ కాదని తమ స్థలమని వాదిస్తూ పత్రాలు చూపిస్తున్నారు. అయితే గ్రామ కంఠంలో అది రోడ్డేనని.. ఇతరులు వాదిస్తున్నారు. ఈ పంచాయతీ ఎలా తేలుతుందో కానీ.. కూతురు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారని... అహం వల్ల ఇలాంటి సమస్య వస్తోందని గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.