ATM Theft:: జగిత్యాల జిల్లాలో ఏటీఎం దొంగలు విఫల యత్నానికి పాల్పడ్డారు. కోరుట్లలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా.. అలారమ్ మోగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు బ్లూ కోల్ట్ సిబ్బందికి చెప్పగా.. వారు హుటాహుటిన రంగంలోకి దిగి దొంగల కారును అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. డబ్బులతో పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే డబ్బులన్నీ నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. డబ్బులను సురక్షితంగా కాపాడగలిగారు గానీ నిందితులను మాత్రం పట్టుకోలేకపోయారు. 


అసలేం జరిగిందంటే..?


జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో అర్ధరాత్రి ఓ ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఓ దొంగల ముఠా ఎస్బీఐ ఏటీఎంని లక్ష్యంగా చేసుకొని కారులో అక్కడకు చేరుకున్నారు. విజయవంతంగా ఏటీఎంలోని లక్షల సొమ్ముని బయటికి తీయగలిగారు. అయితే ఏటీఎంలో చోరీకీ పాల్పడుతున్నప్పుడు మోగిన అలార్ చప్పుడుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే బ్లూ కోల్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది.. కారులో పారిపోతున్న దొంగల ముఠాను అడ్డుకున్నారు. వారి కారుకు అడ్డుగా వీరి జీపును పెట్టారు. ఈ క్రమంలో దొంగలు కారుని మరో మార్గంలో పోనిచ్చారు. అయినా బ్లూ కోల్ట్ సిబ్బంది వారిని వదల్లేదు. వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో దొంగలు డబ్బును బయటకు తీసి పారిపోయే ప్రయత్నం చేయగా... సిబ్బంది పట్టుకున్నారు. ఈ క్రమంలోనే డబ్బంతా రోడ్డుపై పడిపోయింది. ఆ తర్వాత వెంటనే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. 19 లక్షల 200 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 




బ్లూ కోల్ట్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.. 


శనివారం రోజు రాత్రి కోరుట్ల జరిగిన దొంగతనం కేసులో డబ్బుల చోరీ కాకుండా అడ్డుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు. 19 లక్షల రెండు వంద రూపాయలను స్వాధీనం చేసుకున్న కోరుట్ల హెడ్ కానిస్టేబుల్ మేడి రాజయ్య, కానిస్టేబుల్ గట్టు శ్రీనివాస్, ప్రైవేట్ డ్రైవర్ మధులపై ఎస్పీ ప్రశంసలు కురిపించారు.  


నిన్నటికి నిన్న హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్..


హైదరాబాద్ మళ్లీ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. ఇటీవర వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి ఓ దుండగుడు బంగారపు చైన్ లాక్కెళ్లాడు. వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతుండగా బైక్ పై వచ్చిన దుండగుడు బైక్ ఆపి, వెనుక నుంచి వెళ్లి రెండు తులాల బంగారపు చైన్ లాక్కెళ్లాడు. ఈ దొంగతనం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.