ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈసీ విడుదల చేసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8గా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 కాగా.. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉండనుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
Also Read: గుడ్‌న్యూస్! హైదరాబాద్-ముంబయి బుల్లెట్ రైలు కోసం కీలక ముందడుగు
హుజూరాబాద్ మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఖాళీగా అసెంబ్లీ స్థానాలకు కూడా ఒకేసారి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పార్లమెంటు స్థానాలకు కూడా ఈ షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నిక జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఏపీలో బద్వేల్ నియోజకవర్గానికి..
కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా షెడ్యూల్ రావడంతో సీఎం జగన్ సొంత జిల్లాలో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఇప్పటికే ఇక్కడ ఉప ఎన్నిక కోసం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను బరిలో దింపనున్నట్లు కొంత కాలం క్రితమే ప్రకటించారు.
Also Read: e-Shram Card: మీ జీతం 15 వేల కంటే తక్కువా? మీకో శుభవార్త.. ఈ ఒక్క పని ఫ్రీగా చేస్తే ఎన్నో లాభాలు
హుజూరాబాద్‌లో రసవత్తరంగా రాజకీయం
తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్, టీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టడంతో ఆయన పార్టీ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరారు. అంతేకాక, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలుస్తానని ప్రకటించి సవాలు విసిరారు. దీంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇక ఈటలను ఓడించి ఎలాగైనా గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకోవాలని టీఆర్ఎస్ అక్కడ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఇటీవలికాలంలో రాజకీయాలన్నీ కూడా హుజూరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. దీంతో ఇక్కడ ఈటల-గెల్లు మధ్య విపరీతమైన ద్విముఖ పోరు నెలకొంది.