Gangula Kamalakar: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజా సింగ్ అహంకార పూరితంగా, అసంబద్ధంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇతరులను గెలిపించాలని బండి సంజయ్‌కు హెలికాప్టర్ ఇస్తే.. ఈయనను గెలిపించేందుకు మరో నాయకుడు వచ్చాడని ఎద్దేవా చేశారు. బీజేపీలో బండి సంజయ్, రాజా సింగ్ దొందూ దొందేనని గంగుల విమర్శించారు.
రేవంత్ రెడ్డిని బండి సంజయ్ బలి కా బకరా అంటూ వ్యాఖ్యానించడంపై మంత్రి గంగుల స్పందిస్తూ.. నిజానికి బండి సంజయ్, రాజా సింగ్‌లు బలి కా బకరాలు అని విమర్శించారు. బండి సంజయ్‌కు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా టికెట్ ఇచ్చి బలి కా బకరా చేశారని ఎద్దేవా చేశారు. నిషేధిత అభ్యర్థి రాజాసింగ్ అని, అర్ధరాత్రి వెళ్లి కాళ్లు పట్టుకుంటే తిరిగి పార్టీలోకి తీసుకున్నారని ఆరోపించారు. బండి సంజయ్‌కు మూడోసారి మూడో స్థానమేనని అన్నారు.
రాజాసింగ్ రాకతో బండి సంజయ్ గ్రాఫ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడని గంగుల అన్నారు. ఇవాళ కరీంనగర్‌లో రాజా సింగ్ నడిచారని, అలాంటి రోడ్డు ఒక్కటైనా గోషామహల్లో ఉందా? అంటూ ప్రశ్నించారు. తాము చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. బండి సంజయ్ ఎప్పటి మాటలో ఇప్పుడు చెబుతుంటే అందరూ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.
మొదటి రోజు తనకు బీ ఫారం ఇవ్వలేదని అడుగుతున్న బండి సంజయ్, మొదటి రోజు ఎందుకు నామినేషన్ వేయలేదని మంత్రి ప్రశ్నించారు. రాజాసింగ్‌కు దమ్ముంటే ఇప్పుడు గెలవాలని, ఆయన సమర్థుడుతే ఆయన్ను బీజేపీ ఎందుకు పక్కన పెట్టిందని నిలదీశారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో బండి సంజయ్, రాజా సింగ్ ఘోరంగా ఓడిపోతున్నారని అన్నారు. ఎంపీగా సంజయ్ పని చేయలేదని, కాబట్టే ప్రజలు ఆయన్ను ఓడించబోతున్నారని చెప్పుకొచ్చారు.
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్‌ను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దని మంత్రి హితవు పలికారు. ఓట్లు అడిగే పద్ధతి ఇది కాదని, ఏం పని చేశారో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. ప్రజలను రెచ్చగొట్టి కాదని, పనులు చేసి ఓట్లు అడగాలని అన్నారు. గోషామహల్‌లో రాజా సింగ్ చేసిన అభివృద్ధి శూన్యమని, బీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సంజయ్‌ను తీస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు కింద రేషన్ కార్డులు కేంద్రమే ఇవ్వాలనన్నారు.
తెలంగాణ వచ్చినప్పుడు 90 లక్షల రేషన్ కార్డులుంటే అందులో 54 లక్షల కార్డులకే కేంద్రం అంగీకారం తెలిపిందని, మిగతావి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం ఒక్క కొత్త కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. 35.67 లక్షల కార్డులకు ఖర్చు భరించి బియ్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కేంద్రం ఇవ్వకపోయినా తాము కొత్తకార్డులు మంజూరు చేస్తూనే ఉన్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు లక్షల పైచిలుకు కొత్త కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు.
బండి సంజయ్ నామినేషన్‌కు 500 మంది కూడా రాలేదని, ప్రజలకు బీజేపీపై నమ్మకం లేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ తమ తప్పులు ఒప్పుకొని, ఇకపై చేస్తామని చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. కరీంనగర్‌లో 2014, 2018లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీ ఓడిపోతుందని, ప్రజలు విధ్వంసాన్ని కోరుకోవడం లేదన్నారు. ఇన్నాళ్లు బండి సంజయ్ పెద్ద నాయకుడు అనుకున్నానని, రాజాసింగ్‌ను తెచ్చుకున్నప్పుడే చోటా లీడర్ అని అర్థమైందన్నారు.
ఎంఐఎంకు మేయర్ పదవి ఇస్తారని 2018 లోనూ ప్రచారం చేశారని మంత్రి గంగుల బీజేపీపై ఫైర్ అయ్యారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. తమ పార్టీకి అభ్యర్థులు కరువని ఎంఐఎంకు సీట్లిస్తామా? అంటూ ప్రశ్నించారు.