ప్రస్తుతం కరీంనగర్ కేంద్రంగా గ్రానైట్ కంపెనీలపై దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మూడేళ్ల నుంచే ఆరోపణలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయన మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో గ్రానైట్ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి బండి సంజయ్ కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశారు.
2019లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కి బండి సంజయ్ కరీంనగర్ గ్రానైట్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాల గురించి లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సోదాలు జరుగుతుండడంతో ఆ లేఖ వైరల్ గా మారింది.
కాకినాడలోని కొన్ని పోర్టుల ద్వారా కరీంనగర్ కి చెందిన గ్రానైట్ బ్లాకులను అక్రమంగా తరలించారని లేఖలో ఫిర్యాదు చేశారు. దీని ద్వారా భారీ ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని ప్రస్తావించారు. ప్రభుత్వంలోని కీలక పెద్దలకు సంబంధించిన నేతలతో సన్నిహిత సంబంధాల వల్లే సదరు కంపెనీలపై ఎలాంటి పెనాల్టీ గానీ రాష్ట్ర ప్రభుత్వం విధించలేదని ఫిర్యాదు చేశారు. నిజానికి తప్పుడు సమాచారం అందించిన కంపెనీలకు ఐదు రెట్ల పెనాల్టీ విధించాల్సి ఉందని అప్పటి లేఖలో గుర్తు చేశారు. చైనాలో ఈ విధంగా అక్రమంగా గ్రానైట్ల బ్లాకులను తెప్పించుకున్న అక్కడి కంపెనీలపై అక్కడి ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుందని కూడా తెలిపారు. ఈ రకమైన అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరం కాబట్టి, వెంటనే జోక్యం చేసుకొని సదరు కంపెనీలను గుర్తించి వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
గ్రానైట్ వ్యాపారుల్లో తెలంగాణకు చెందిన వారి ఇళ్లు, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. తాజాగా హైదరాబాద్ సహా కరీంనగర్‌లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం (నవంబరు 9) ఉదయం నుంచే కేంద్ర బలగాలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసుకు చేరుకున్నాయి. కరీంనగర్, హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహించేందుకు తెల్లవారుజామునే అధికారులు వెళ్లారు.
హైదరాబాద్ సోమాజీగూడ, అత్తాపూర్‌లో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో, కరీంనగర్‌లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈడీ, ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో గ్రానైట్ రవాణా పన్ను ఎగవేసిన వ్యవహారంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.
కరీంనగర్ మంకమ్మ తోటలోని శ్వేతా గ్రానైట్స్ కార్యాలయం, కమాన్ ఏరియాలోని అరవింద వ్యాస్ గ్రానైట్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ శ్వేతా గ్రానైట్ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందినది. మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చినందున వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, గతంలో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ పరిమాణం చూపి విదేశాలకు ఎక్కువ ఎగుమతులు చేయడంపై ఈడీ ఆరా తీస్తోంది.