ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం పర్యటన వివాదాస్పదం అవుతుంది. వామపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకొని తీరతామని ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు హెచ్చరించాయి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న ప్రధాని మోదీని అడ్డుకుని తీరుతామని తాజాగా జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) ఏడాది క్రితమే ఉత్పత్తిని ఆరంభించిందని, దాన్ని ఇప్పుడు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. గోదావరిఖనిలో కార్మిక సంఘాల నాయకులు బుధవారం (నవంబరు 9) మీడియాతో మాట్లాడారు.
బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధానికి నిరసన సెగ తగలాలని చెప్పారు. గోదావరి ఖనిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేస్తున్నామని చెప్పారు.
యూనివర్సిటీ స్టూడెంట్స్ జేఏసీ కూడా
మరోవైపు, ప్రధాని రామగుండం పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ కూడా ప్రకటించింది. యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మోదీ పర్యటన అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఈ యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకు గత సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీలోఆమోదం తెలిపారు. దానికి గవర్నర్ ఆమోదించకపోవడంపై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోంది. ఇతర రాష్ట్రాలకు ఒకలా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని జేఏసీ నాయకులు ఆరోపణలు చేశారు.
Also Read: Hyderabad: 30 టీమ్‌లతో ఈడీ అధికారులు రంగంలోకి, మంత్రి గంగుల ఇంట్లోనూ సోదాలు!
తెలంగాణ వికాస సమితి కూడా
ఇటు, తెలంగాణ వికాస సమితి కూడా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తోంది. ఇటీవల తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మాట్లాడిన ప్రతిసారీ.. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణను అవమానిస్తున్నారని, అందుకే ప్రధాని మోదీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం కావడం వల్ల విపరీతమైన దుర్వాసన వస్తోందని, రామగుండం ప్రాంత భూ నిర్వాసుతులకు ఇప్పటికి న్యాయం చెయ్యకుండా.. పరిశ్రమను ప్రైవేటుకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కు కట్టబెట్టి సింగరేణిని కూడా అంతం చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారని అన్నారు. మోదీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక ధోరణిని.. తెలంగాణ వికాస సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. కృష్ణ జలాల పంపిణీని ఇప్పటికీ తేల్చకుండా తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని మోదీ.. తమ రైతుల వడ్లు కొనమంటే నూకలు తినండి అని అవమానించారని గుర్తు చేశారు.