ప్రధాని నరేంద్ర మోదీ  నవంబర్ 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజు  రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమంపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య అప్పుడే ప్రొటోకాల్ వివాదం మొదలైంది. ప్రధాని మోదీ హాజరయ్యే ఈ ఈవెంట్‌ కోసం పంపిన ఆహ్వానంలో కేంద్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ను పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణలో అధికారిక భాగస్వామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానించిందని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాలకు హాజరుకాలేదు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ప్రధాని మోదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకింతం చేసే కార్యక్రమానికి సైతం సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.


ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ పేరు తర్వాత అతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేరును చేర్చలేదని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న ఫ్యాక్టరీ ఈవెంట్లో సీఎంకు నామమాత్రంగా ఆహ్వానం పంపి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని తమ ట్వీట్లో రాసుకొచ్చారు. తెలంగాణకు ప్రధాని మోదీ మళ్లీ ఉత్త చేతులతోనే వస్తున్నారని పేర్కొన్న టీఆర్ఎస్ నేతలు.. తెలంగాణకు చేసిన అన్యాయాలు, విభజన హామీల అమలు అంశాలపై ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశారు. 






రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ మరోసారి మనకు ఏం ప్రయోజనాలు కల్పించకుండా, ఉత్త చేతులతోనే వస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ‘తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఏం చెబుతారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు సంగతిపై ఏమంటారు. నీతి ఆయోగ్ చెప్పిన విధంగా తెలంగాణకు నిధులు ఎప్పుడు ఇస్తారు. తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతోందంటూ’ టీఆర్ఎస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రధాని మోదీపై ప్రశ్నల వర్షం కురిపించింది. రెండేళ్ల కిందటే పునఃప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతిని అంకితం చేసే పేరుతో కేంద్ర ప్రభుత్వం మాయ చేస్తుందని, దీని వల్ల రాష్ట్ర ప్రజలకు ఏ ప్రయోజనం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాల్సిన నిధులను సకాలంలో అందించాలని పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేయడం తెలిసిందే.