E-NAM Scheme: పథకం ఎంత గొప్పగా ఉందనే దాని కంటే అది నిర్దేశిత ప్రజలకు సరైన విధంగా ఉపయోగపడినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. అలా మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఓ పథకం ఇప్పుడు ఏ ప్రయోజనం లేకుండా పోతోంది. రైతులకు గరిష్ట ప్రయోజనం దక్కాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016 లో జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ఈ-నామ్ విధానాన్ని ప్రారంభించింది. వ్యాపారి దేశంలో ఏ మార్కెట్ లో నమోదైనా, మరే మార్కెట్ కి వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను అయినా కొనుగోలు చేసేలా రూపకల్పన చేశారు. మంచి లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. క్షేత్ర స్థాయిలో కొనుగోలుదారు ప్రతినిధులు అనివార్యం అవుతుండటం, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను లెక్కించే పరికరాలు అందుబాటులో లేకపోవడం, నేల వాతావరణ పరిస్థితులను బట్టి నాణ్యత వేరుగా ఉండటం, ఇతర కారణాలతో ఆన్ లైన్ కొనుగోలు వ్యవస్థ నామమాత్రం అయింది. 


ఆన్ లైన్ విధానం వల్లే అన్నదాతలకు అవస్థలు..


ఈ విధానం అమలులోకి వచ్చినా అనుభవ పూర్వక ఇబ్బందుల పరిష్కారం, సమస్యలను అధిగమించేందుకు పాలకులు చొరవ తీసుకోకపోవడంతో ఆన్ లైన్ విక్రయాలు పరిమితం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఐదు మార్కెట్లు ఈ-నామ్ పరిధిలో ఉన్నాయి. వీటిలో పెద్దపెల్లి, జమ్మికుంటలో మాత్రమే కొంత మేరకు అమలు అవుతోంది. బహిరంగ వేలంలో వ్యాపారులు ఒక్కటై ధరల నియంత్రణకు పాల్పడతారని ఆన్ లైన్ లోనే బిడ్డింగ్ నడిచేలా రూపొందించిన ఈ విధానం, ఆఫ్ లైన్ విధానాన్ని పోలి ఉండటంతో రైతులకు పూర్తి ప్రయోజనం ఉండటం లేదు. నిబంధనల మేరకు ఒక మార్కెట్ కు వచ్చిన ఉత్పత్తుల నాణ్యతను, వివిధ పద్ధతుల్లో లెక్కించి ఆన్ లైన్ లో నిక్షిప్తం చేయాలి. ఆన్ లైన్ లో ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించిన కొనుగోలుదారులు ఎక్కడి వారైనా ఆన్ లైన్ లో నిర్దేశిత సమయంలోగా ధరలను కోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పత్తిని కొనుగోలు చేసే వ్యాపారులు లేదా వారి ప్రతినిధులు తప్పనిసరిగా మార్కెట్ కు వచ్చి నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు జరుపుతున్నారు. 


స్థానిక మార్కెట్లకే పరిమితం..


రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. పత్తి నాణ్యత నిర్ధారించడం సంక్లిష్టతతో కూడింది కావడం.. దీనికి ప్రత్యామ్నాయంపై మార్కెటింగ్ శాఖ దృష్టి సారించకపోవడంతో ఆన్ లైన్ కొనుగోలు స్థానిక మార్కెట్ కే పరిమితమయ్యాయి. ఇతర పంటలతో పోలిస్తే పత్తి నాణ్యత లెక్కింపు భిన్నంగా ఉంటుంది. రంగు, పింజ పొడవు, తేమశాతం, మైక్ తో పాటు, ఎండిన ఆకుల మిశ్రమం పూర్తిగా పూయని కాయతో కూడిన పత్తి మిశ్రమంగా ఉంటుంది. అయితే వీటిలో ఒక్కో అంశాన్ని లెక్కించి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా ఇబ్బందితో కూడిన ఈ ప్రక్రియ చేపట్టకుండా నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లో వివరాలను పొందుపరచడం లేదు. దీంతో ఇతర మార్కెట్ కు చెందిన వ్యాపారులు ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు పూర్తిస్థాయి ప్రయోజనం లేకుండా పోతుంది.


సహాయకులను పంపించ లేని వారు స్థానిక కొనుగోలుదారుల సాయంతోనే అవసరాలు తీర్చుకుంటున్నారు. ఒక విధంగా స్థానిక కొనుగోలుదారులు బయటి వ్యాపారులకు దళారులుగా పనిచేస్తున్నారు అనేది నిజం. నాణ్యత ప్రమాణాలను గణించడం లో జరుగుతున్న వైఫల్యమే పత్తిలో ఈ-నామ్ విధానానికి  తూట్లు పొడుస్తోంది.