Minister Gangula Kamalakar : వ‌ర్షాలు త‌గ్గాక సీజ‌నల్ వ్యాధులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ  మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయ‌న్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సుర‌క్షిత మంచినీటి స‌రఫ‌రాతో అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు కూడా చాలా తగ్గాయ‌ని స్పష్టం చేశారు. వర్షాల అనంతరం  ప్రబ‌లుతున్న సీజ‌నల్ వ్యాధుల‌పై కరీంనగర్ జిల్లాస్థాయి అధికారులతో  మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం ననిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, కార్పొరేషన్ కమిషనర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో నెలకొన్న పరిస్థితులపై సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. 


మలేరియా, డెంగ్యూ పెరగకుండా 


ఐదేళ్ల క్రితం వ‌ర్షాలు త‌గ్గిన త‌ర్వాత డెంగ్యూ విజృంభించిన విష‌యాన్ని మంత్రి గంగుల కమలాకర్ గుర్తుచేశారు. మ‌లేరియా, డెంగ్యూ కేసులు పెర‌గ‌కుండా నివార‌ణ చర్యలు తీసుకుంటున్నామ‌ని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామ‌ని అధికారులు మంత్రికి స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం హెల్త్ టీమ్స్ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని నిర్ణయించామ‌ని మంత్రి చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంద‌న్నారు. ప్రజలందరూ తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా తమ చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


 హాస్టల్స్ లో సన్న బియ్యం


ప్రభుత్వ పాఠ‌శాల‌లు, హాస్టల్స్‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం క్వాలిటీ ఉండేలా చూసుకోవాల‌ని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటిక‌ప్పుడు త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించారు.  ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఆహార నాణ్యత ముఖ్యంగా పరిగణించాలని కోరారు.


బూస్టర్ డోస్ 


ప్రజలందరూ బూస్టర్ డోస్ వేసుకోవాల‌ని మంత్రి కోరారు. క‌రోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాప్రతిధులు, అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల అప్రమత్తతే ముఖ్య ఆయుధమని ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ వేసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని  అన్నారు.


Also Read : Villagers Protest: మండలం చేసేయండి సార్ - వర్షంలో గొడుగులతో రోడ్డుపై ధర్నా!