Mla Rasamayi Balakishan : కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలో విలేకరులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు జర్నలిస్టులను బెదిరించేవిగా, తమ పార్టీ కార్యకర్తలను వారిపైకి ఉసిగొలిపేలా ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది. గన్నేరువరం మండల అభివృద్ధికి సంబంధించి ప్రజలు, ప్రజాస్వామికవాదులు చేపట్టే ఆందోళనలకు గన్నేరువరం ప్రెస్ క్లబ్ తో పాటు జిల్లా యూనియన్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
ఆందోళన కార్యక్రమాలకు మద్దతు
శనివారం కరీంనగర్ ప్రెస్ భవన్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, దాడుల నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఐలు రమేష్, జిల్లా యూనియన్ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ నాయకత్వంలో గన్నేరువరం ప్రెస్ క్లబ్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు రహదారి నిర్మాణం కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని తీర్మానించారు. భవిష్యత్తులో గన్నేరువరం అభివృద్ధికి సంబంధించి ప్రజలు చేపట్టే ప్రతి ఆందోళన కార్యక్రమంలో అక్కడి ప్రెస్ క్లబ్ తో పాటు జిల్లా యూనియన్ భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకున్నారు.
మీరు పిడికెడు మాత్రమే
"మేము మీకు బానిసలం కాదు ప్రజలకు మాత్రమే బానిసలం, మీరు పిడికెడు అంతమంది... మేము గుప్పెడంత మందిమి" అంటూ ఎమ్మెల్యే రసమయి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ జర్నలిస్టులను ఉద్దేశించినవేనని యూనియన్ భావించిందన్నారు. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్న కారణంతో, ఫిర్యాదు చేసినప్పుడు గన్నేరువరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారన్న కోపంతో ఆయనను రాత్రికి రాత్రే విధుల నుంచి తప్పించడం వెనక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని యూనియన్ సభ్యులు ఆరోపించారు. ఎమ్మెల్యే ఒత్తిడితో అనేక పత్రికల నుంచి విలేకరులను తొలగించడం పత్రిక స్వేచ్ఛను హరించడంగా యూనియన్ భావించింది. పత్రికల నుంచి విలేకరులను తొలగించినంత మాత్రాన భయపడేది లేదని యూనియన్ స్పష్టం చేసింది. త్వరలో జరగనున్న జిల్లా కార్యవర్గంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించి జిల్లా వ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వాలని యూనియన్ నిర్ణయించింది. తొలగించిన విలేకరి శ్రీనివాస్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది. ప్రజాసమస్యలను ప్రభుత్వాలకు తెలియజేసే జర్నలిస్టులపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నగునూరి శేఖర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎలగందుల రవీందర్ తో పాటు గన్నేరువరం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Also Read : Hyderabad News : శంకర్ పల్లి ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ ఘటన, 12 మంది విద్యార్థులపై ఏడాది పాటు సస్పెన్షన్!