Karimnagar News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఉన్న మండలాలకు తెలంగాణ ఏర్పడిన తరువాత మోక్షం లభించింది. 2016లో కరీంనగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విడిగొట్టారు. దీంతో పాలనపరమైన సౌలభ్యం వస్తుందని అధికారులు అప్పట్లో భావించారు. అయితే ప్రస్తుతం మరోసారి జిల్లా రెవెన్యూ యంత్రాంగం కొత్త మండలాలు ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల నుంచి 16 మండలాలతో నూతనంగా కరీంనగర్ జిల్లాను అప్పట్లో ఏర్పాటుచేశారు. బెజ్జంకి లాంటి కొన్నింటిని పక్క జిల్లా అయిన సిద్దిపేటలో కలిపారు. ఆ తరువాత మళ్లీ కొత్త ప్రతిపాదనలు వినిపించినప్పటికీ అధికారులు ఆ వైపుగా దృష్టి సారించలేదు. అయితే హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో ఇల్లంతకుంట మండలం వావిలాలపల్లి, వీణవంక మండలం చల్లూరు గ్రామాలకు కూడా కొత్తగా మండలం హోదా కట్టబెడతారనే వాదన వినిపించింది. 


అందరికీ అనుకూలంగా


ఇందులో భాగంగానే మరోసారి జిల్లా రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొన్ని మండలాల ఎమ్మార్వోలను దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అందరికీ అనుకూలంగా ఉండేలా, గ్రామస్థాయిలో పరిపాలన మరింత తేలిక అయ్యేలా పక్క గ్రామాలతో కలిపి కొత్త మండలాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయాన్ని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. సాధ్యాసాధ్యాలు  పరిశీలించాలని, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా రిపోర్టు కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందుగానే సర్వం సిద్ధం చేయాలని కోరినట్లు సమాచారం. ఇక హుజురాబాద్ లోని ఆ రెండు గ్రామాలు మాత్రమే కాకుండా రామడుగు మండలంలో రెవెన్యూ పరంగా, కనెక్టివిటీ పరంగా ముఖ్య గ్రామమైన గోపాల్రావుపేట, గంగాధర మండలంలోని గర్శకుర్తిని మానకొండూరు మండలంలోని పచ్చునూర్ గ్రామాన్ని కూడా కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 


సైలెంట్ సర్వేలు


అయితే దీనికి సంబంధించిన వివరాల సేకరణ పూర్తిగా రహస్యంగా జరగాలని ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే వరకు ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని సరిగ్గా అంచనా వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి కొత్త మండలాలను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్న డిమాండ్ ను మరోసారి నెరవేర్చినట్టు అర్థమవుతుంది. 


Also Read : Karimnagar: కాంగ్రెస్‌లోకి కరీంనగర్ పాత లీడర్స్, మారిన రాజకీయంలో చేరికల జోరు - కార్యకర్తల్లో జోష్!