హైదరాబాద్ శివారు పటాన్ చెరు మండలం చినకంజర్లలో కోడి పందేలు పెద్ద ఎత్తున జరిగిన ఘటనలో ఉదయం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రధాన సూత్రదారి అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన పరారీలో ఉన్నారని, పోలీసులు మాజీ ఎమ్మెల్యే కోసం వెతుకుతున్నారని ప్రజారం జరుగుతుంది. చింతమనేని ప్రభాకర్ తో పాటు మరో 40 మంది పరారీలో ఉన్నారని పటాన్ చెరు డీఎస్పీ వెల్లడించారు.
అయితే, కోడిపందాల ఘటనపై చింతమనేని ప్రభాకర్ స్పందించారు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫేస్ బుక్ వేదికగా చింతమనేని స్పందిస్తూ.. ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అని ప్రశ్నించారు. కోడిపందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్టు చూపిస్తున్నారని ఆరోపించారు. నీచమైన ప్రచారంతో కుప్పకూలే మేడలు కట్టి కొంత మంది అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మీ మేడ కూలిపోయే సమయం అసన్నమైందని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.
‘‘కోడి పందాల్లో లేని వ్యక్తి నీ ఉన్నట్లు గానే చూపటం మీ జెండా అజెండా ఇంత రాక్షస రాజకీయం అవసరమా...? రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొండి. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైన ఆపండి. ఈ నీచమైన ప్రచారం తోనే కుప్ప కూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమయింది. మీ అసత్యాలు సాక్షి నీ ప్రజలు కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమయింది. ఆ రోజు కొసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ రాక్షస రాజకీయ వికట ఆట్టహాసానికి ముగింపు త్వరలోనే.’’ అని చింతమనేని ప్రభాకర్ తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చారు.
అర్ధరాత్రి సోదాలు
హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మాజీ టీడీపీ ఎమ్మేల్యే, ఏపీకి చెందిన చింతమనేని ప్రభాకర్ సహా పలువురు వీఐపీలు దీనికి వెనక ప్రధాన సూత్రధారులని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోడి పందాల నేపథ్యంలో లక్షల్లో బెట్టింగ్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ శిబిరంపై దాడులు చేసిన పోలీసులు 21 మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు తప్పించుకోగా, వారి కోసం గాలిస్తున్నారు.
అయితే, పోలీసులను చూసి చింతమనేని ప్రభాకర్ పరార్ అయినట్లుగా తెలుస్తోంది. పటాన్ చెరు డీఎస్పీ భీం రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పటాన్ చెరు సమీపంలో చిన్న కంజర్ల గ్రామంలోని ఓ తోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. గత కోంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వారి నుంచి రూ.13,12,140 నగదు స్వాధీనం చేసుకున్నారు. 26 వాహనాలు, 32 పందెం కోళ్లు, 30 కోడి కత్తులు, 27 సెల్ ఫోన్లు ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కోడి పందాల్లో మొత్తం 70 మంది బెట్టింగ్ రాయుళ్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
49 మంది పరారీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని పోలీసులు భావిస్తున్నారు. మరో ముగ్గురు నిర్వహకులు అక్కినేని సతీష్, కృష్ణంరాజు, బర్ల శ్రీను పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు. పోలీసుల అదుపులో సతీష్, బర్ల శ్రీను ఉండగా, చింతమనేని సహా కృష్ణంరాజు అనే వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.