రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకు మారుతున్న పరిస్థితులు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్‌లోనూ కదలిక తీసుకువస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు చేయించుకుంటున్న సర్వేల ఫలితాలు ఆ పార్టీలకు ఆశించినంత అనకూలంగా లేవని సోషల్‌ మీడియా లో వస్తున్న వార్తలు ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు హుషారుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.


హుస్నాబాద్‌ మాజీ శాసనసభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరి మూడేళ్లు కావస్తున్నా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా మిగిలిపోయారు. దీంతో ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఆయన కూడా ఆ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరిగింది. నియోజకవర్గంలోని ఆయన సన్నిహితులు, సీనియర్‌ నేతలు, ఆయనకు సత్సంబంధాలున్న అన్ని గ్రామాల ముఖ్యులు కాంగ్రెస్‌లోనే చేరాలని, బీజేపీలో చేరితే అంత సానుకూలత ఉండదని చెప్పడంతో ఆయన కాంగ్రెస్‌వైపే మొగ్గుచూపారు. ఈ నెల 6న ఆయన పలువురు బీజేపీ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం.


ఇక జిల్లాకే చెందిన మరో ఇద్దరు మాజీ శాసనసభ్యులపై కూడా కాంగ్రెస్‌ పార్టీ దృష్టిసారించిందని, వారు కూడా గతంలో కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన నాయకులే కావడంతో పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. వారికి అసెంబ్లీ టికెట్‌ ఇచ్చే విషయంలో స్పష్టత ఇస్తేనే పార్టీ మారతారని, లేని పక్షంలో చేరకపోవచ్చునని ప్రచారం జరుగుతున్నది. రామగుండం ప్రాంతంలో ఒక జడ్పీటీసీ, చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు, టీఆర్‌ఎస్‌ సహకార సంఘ నేత కూడా కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతుంది. 


అసెంబ్లీ టికెట్ హామియే ఫైనల్...


ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎవరికి ఎక్కడ అవకాశం లభిస్తుంది అనే విషయంలో చర్చ జరుగుతున్నది. అందరి దృష్టి అసెంబ్లీకి పోటీ చేయడం విషయంపైనే ఉండడంతో టికెట్‌ వచ్చే అవకాశాల మేరకే పార్టీల మార్పిడి ఉంటుందని, అందుకే ఈ చర్చ రోజు రోజుకు పెరిగిపోతున్నదని చెబుతున్నారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు ఎస్సీలకు రిజర్వ్‌ చేయగా, మూడు స్థానాల్లో వెలమలకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. 


ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ??


పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి రత్నాకర్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా రత్నాకర్‌రావు కుమారుడు నర్సింగరావుకు కోరుట్ల అసెంబ్లీ టికెట్‌ ఇస్తామని బహిరంగంగానే ప్రకటించారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పేరు కూడా ఇప్పటికే రేవంత్‌రెడ్డి నోటి నుంచి వెల్లడైందని పార్టీలో ప్రచారంలో ఉంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అక్కడ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. వెంకట్‌ సొంత నియోజకవర్గం పెద్దపల్లి అయినా హుజూరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈ సందర్భంలోనే ఆయనను వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా తిరిగి అభ్యర్థిగా పోటీలో నిలుపుతామని హామీ ఇవ్వడంతోటే పోటీ చేశారని చెబుతున్నారు.


దీంతో వెలమ సామాజికవర్గానికి ఇప్పటికే మూడు స్థానాలు ప్రకటించినట్లయింది. మంథని నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డికి అవకాశం దక్కనున్నది. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు అక్కడ నుంచి గతంలో పోటీ చేసిన కేకే మహేందర్‌ రెడ్డికి రేవంత్‌రెడ్డి అండ ఉందని, ఆయనకే టికెట్‌ లభించవచ్చని చెబుతున్నారు.


వేములవాడ, హుస్నాబాద్‌, కరీంనగర్‌, రామగుండం నియోజకవర్గాలు మిగిలి ఉండగా వీటన్నింటిని బీసీలకు కేటాయించాలని ఆ వర్గానికి చెందిన నాయకులు కోరుతుండగా ఇతరులు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచార్జిగా బొమ్మ శ్రీరాంచక్రవర్తి పనిచేస్తున్నారు. ఆయన తండ్రి బొమ్మ వెంకటేశ్వర్లు ఇక్కడ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. శ్రీరాంచక్రవర్తి ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తుండగా ప్రస్తుతం అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో వారిద్దరిలో ఎవరికి అవకాశం దక్కనున్నదో అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్‌రెడ్డికి అవకాశం దక్కితే బీసీలకు ఒక స్థానం తగ్గిపోతుంది. కరీంనగర్‌లో గతంలో పొన్నం ప్రభాకర్‌ పోటీ చేయగా ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.  ఇదే స్థానంపై కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెస్సార్‌ మనుమడు రోహిత్‌రావు, మాజీ ఎంపీ చొక్కారావు మనమడు పార్లమెంట్‌ నియోజవర్గ యువజన కాంగ్రెస్‌ ఇన్‌చార్జి జువ్వాడి నిఖిల్‌ చక్రవర్తి, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు రితీష్‌రావు, రమ్యారావు టికెట్‌ ఆశిస్తున్నారు.


వీరిలో అంజన్‌కుమార్‌ ఒక్కరే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లే భావించవచ్చు. రామగుండం నియోజకవర్గంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పోటీలో ఉన్నారు. ఆది శ్రీనివాస్‌, మక్కాన్‌సింగ్‌ ఇద్దరు బీసీ వర్గానికి చెందినవారే. బీసీలకు కనీసం నాలుగు స్థానాలైనా ఇవ్వని పక్షంలో ఆ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొనే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరికల కోసం ఆకర్ష్‌ వలలు ఎన్ని విసిరినా ఏయే నియోజకవర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలో సామాజికవర్గాల వారిగా స్పష్టత వస్తే తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చని అంటున్నారు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చి అధికార పార్టీతో దీటుగా సముచిత స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.