Nirmala Sitharaman : ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మారుస్తున్నారని, కేంద్రం ఒకటి పెడితే రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందన్నారు. దీనిపై కేంద్రం ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ లో బలవంతంగా చేరిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు వ్యయం కన్నా రూ.లక్ష 20 వేల కోట్లకు అధనంగా పెంచారన్నారు. ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్లుగా పెంచుతున్నారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. మన ఊరు-మన బడి కేంద్ర పథకం అయితే దాన్ని రాష్ట్ర స్కీమ్ గా క్లెయిమ్ చేసుకుంటున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతాయనే ఆయుష్మాన్ భారత్ లో చేరడం లేదన్నారు.
రైతు ఆత్మహత్యలలో నాలుగో స్థానం
తెలంగాణలో 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారు. ఫసల్ బీమా యోజన ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణ మాఫీ ఎందుకు చేయలేకపోయారు. రైతు బీమా కౌలు రైతులకు ఎందుకు ఇవ్వరు. పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప వాటిని నెరవేర్చడం లేదు. మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్ అయింది. బడ్జెట్ అప్రూవల్ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదు. బడ్జెట్ లో చాలా అప్పులు చూపించడం లేదు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది. - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ప్రతి పిల్లాడిపై రూ.1.25 లక్షల అప్పు
తెలంగాణ లో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1 .25 లక్షల అప్పు ఉందని కేంద్ర మంత్రి సీతారామన్ ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎమ్ లిమిట్ ను తెలంగాణ దాటి పోతుందన్నారు. బిహార్ లో ఎలా ఉందో చూశారని, అక్కడి సీఎం ఈ సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారన్నారు. దేశం మొత్తం తిరిగే ముందు తెలంగాణలో సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. లిక్కర్ స్కామ్ ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తే స్పందిచాల్సింది ఆమె తాను కాదు అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు నిర్మలా సీతారామన్.
Also Read : MP Dharmapuri Arvind : బిహార్ లో తెలంగాణ పరువు తీశారు, సీఎం కేసీఆర్ టూర్ పై ఎంపీ అర్వింద్ సూటి ప్రశ్నలు
Also Read : అమర జవాన్ యాదయ్య కుటుంబానికి ఎప్పుడు న్యాయం చేస్తారు? సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ