MP Dharmapuri Arvind : నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ అటు ప్రతిపక్షం బీజేపీ సెటైర్లు వేసుకుంటున్నారు. ఇందూరుకు వస్తున్న సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ ధర్మపురి అర్వింద్. ఈనెల 5న నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని నిజామాబాద్ జిల్లా బీజేపీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెబితేనే రావాలని లేకుంటే అవసరం లేదన్నారు ఎంపీ అర్వింద్. జిల్లాకు ఇచ్చిన హామీలను ఎంపీ అర్వింద్ గుర్తుచేశారు. అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఇంకా ఏం ముఖం పెట్టుకుని జిల్లా పర్యటనకు వస్తున్నావని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.
హామీల మాటేంటీ?
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పూర్తయి రెండేళ్లు అయ్యింది. వర్షాలకు నీళ్లలో మునిగి తేలిన తర్వాత ప్రారంభించేందుకు వస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని అన్నారు ఎంపీ అర్వింద్. ఈ నెల 3న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందురూ జనతా కో జవాబ్ దో పేరుతో సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు జిల్లా ప్రజలు తరలిరావాలని ఎంపీ అర్వింద్ పిలుపునిచ్చారు. జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఈ సభ ద్వారా గుర్తు చేయనున్నామని చెప్పారు. గీత కార్మికుల కోసం నీరాను జాతీయంగా మార్కెటింగ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, ప్రతి లీటర్ పాలకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. నాయి బ్రాహ్మణులకు వాడే ఉపకరణాలు 50 శాతం సబ్సిడీ, రజకులకు ప్రతి గ్రామంలో దోబీ ఘాట్ నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారని, మోతెలో పసుపు పరిశోధన కేంద్రం, మహిళా సంఘాలకు ప్రాసెసింగ్ యూనిట్ లు అప్పగిస్తామన్నారు వీటి సంగతేంటని అడిగారు ఎంపీ అరవింద్.
317 జీవోతో ఉపాధ్యాయులు ఆగం
మోతె గ్రామాన్ని తన సొంత గ్రామంగా చెప్పిన కేసీఆర్ ఆ గ్రామానికి ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు అర్వింద్. నిజాం చక్కెర పరిశ్రమ వంద రోజుల్లో తెరిపిస్తామన్నారని, ఆర్మూర్ లో లెదర్ పార్క్, రైతులకు ఉచిత ఎరువులు, రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా మారుస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐసెల్ ఎటుపోయిందని ప్రశ్నించారు అరవింద్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మిస్తామన్నామని ఇచ్చిన హామీని మరిచారా? కేజీ టు పీజీ ఎటుపోయిందని అన్నారు ఎంపీ అరవింద్. 317 జీవోతో ఉపాధ్యాయులను ఆగం చేశారన్నారు. వీఆర్ఏ లకు ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. ఉద్యమ అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, సాగు భూమి, అమరుల స్మారక చిహ్నం అన్నారని ఇవన్నీ ఎటు పోయాయని ప్రశ్నించారు ఎంపీ అర్వింద్. కనీసం అమరుల కుటుంబాల మీద ఉన్న కేసులు కూడా ఎత్తేయలేదని అన్నారు. 125 గజాల్లో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, గిరిజనులకు పొడు భూముల పట్టా, రైతు బంధు ఇస్తామన్నారు. దళిత, గిరిజన బిడ్డలకు విదేశీ చదువులకు రూ.25 లక్షలు ఇస్తామన్నారని వీటి మాటేమిటని ప్రశ్నించారు అర్వింద్.
బిహార్ లో తెలంగాణ పరువు తీశారు
తెలంగాణ యూనివర్సిటీతో చికాగో వర్శిటీకి ఒప్పందం ఎటుపోయిందని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. ప్రతి మండలానికి వంద పడకల ఆస్పత్రి, నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరానికి సాగు నీరు హామీ ఇచ్చారని, కానీ ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదన్నారు. బాల్కొండకు డిగ్రీ కళాశాల ఎటు పోయిందన్నారు. మోతెకు వందశాతం డ్రిప్ చేస్తామని, అసెంబ్లీ మాదిరిగా పంచాయతీ కార్యాలయం కట్టిస్తా అన్నారని కానీ ఆ హామీలు నెరవేరలేదన్నారు. ఈ హామీల గురించి కేసీఆర్ తన పర్యటనలో జవాబు ఇవ్వాలని అన్నారు అర్వింద్. ఈ నెల 5న జరిగే సభకు సంబంధించి ఇప్పటి వరకు ఆహ్వాన లేఖ రాలేదని ఎంపీ అర్వింద్ అన్నారు. సభకు ఆహ్వానం పంపాలని కోరారు. ఎంపీగా తనకు సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని, అలా అయితేనే సభకు వస్తానని అన్నారు ఎంపీ అర్వింద్. బిహార్ లో తెలంగాణ పరువు తీశారని, అక్కడ ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరును అర్వింద్ ఎద్దేవా చేశారు. ఈ నెల 3న బీజేపీ నిర్వహించే ఇందూరు జనతా కో జవాబ్ దో సభకు సంబంధించిన ఆహ్వాన లేఖను మీడియా ముందు రిలీజ్ చేశారు.
Also Read : HarishRao : వారంలో 28వేల పోస్టులకు నోటిఫికేషన్స్ - గ్రూప్ 4 కూడా ! తెలంగాణ నిరుద్యోగులకు ప్రిపరేషన్ టైం
Also Read : Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా, గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు!